ఆ హాలీవుడ్ సినిమానే కదా.. మన ఇండియాలో ఎవరు చూస్తారు.. అందులోనూ మన తెలుగులో ఎవరు చూస్తారు..? ఆ సినిమాల వల్ల మన స్టార్ హీరోల సినిమాల వసూళ్లు దెబ్బతింటాయా..? అంతలేదులే అనుకుంటున్నారేమో..? ఇప్పుడు కాలం మారిపోయింది. హాలీవుడ్ సినిమాలకు కూడా మన దగ్గర వసూళ్ల ప్రభంజనం సాగుతుంది. గత కొన్నేళ్లలో అవతార్.. 2012.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7..
జురాసిక్ వరల్డ్.. జంగిల్ బుక్ లాంటి హాలీవుడ్ సినిమాలు ఇండియాలోనూ కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇప్పుడు అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్ కూడా ఇదే చేస్తుంది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి క్రేజ్ ఉండటం ఆశ్చర్యం కాదు కానీ ఇండియాలో ఇంత క్రేజ్ ఉండటం మాత్రం నిజంగా ఆశ్చర్యమే.
ఎందుకంటే ఎప్రిల్ 27న సినిమా విడుదలంటే.. వారం రోజుల ముందే అన్ని మల్టీప్లెక్సుల్లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. వారం రోజుల వరకు టికెట్స్ లేవు. కేవలం బుకింగ్స్ రూపంలోనే ఈ చిత్రం తొలిరోజు 22 కోట్లు వసూలు చేసింది. ఈ లిస్ట్ లో బాహుబలి 2 మాత్రమే 37 కోట్లతో ముందుంది.
ఈ వారం కచ్చితంగా అవేంజర్స్ దెబ్బకు భరత్ అనే నేను కలెక్షన్లకు భారీ గండి పడటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పడిన ప్రీమియర్స్ కు రెస్పాన్స్ ఊహించినంతగా రాలేదు.. ఇదొక్కటే ఇప్పుడు అవేంజర్స్ టీంను కంగారు పెడుతున్న విషయం.