ఏదో జరుగుతుంది.. కానీ ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. తెరవెనక ఏదో జరుగుతుంది.. కానీ ఎవరూ క్లారిటీ ఇచ్చేవాళ్లు లేరు. ఇప్పుడు చిరంజీవి సైరా సినిమా విషయంలో ఇదే అనుమానాలు ఉన్నాయి అభిమానుల్లో. లేకపోతే మరేంటి.. ఎప్పటికప్పుడు రెండో షెడ్యూల్ ఇదిగో అంటూ డేట్ ఇస్తున్నారు కానీ పట్టాలెక్కించడం మాత్రం లేదు. డిసెంబర్ 22న తొలి షెడ్యూల్ అయిపోయింది. అంటే ఇప్పటికే మూడు నెలలు కావొస్తుంది. మధ్యలో గ్రాఫిక్స్ కోసం ఓ సారి వాయిదా వేసారు. సరే అనుకోవచ్చు.. సినిమాకు సంబంధించిందే కాబట్టి ఎవరూ ఏం అనలేదు. ఆ తర్వాత నయనతార డేట్స్ కోసం ఓ సారి వాయిదా పడిందని తెలిసింది. ఇంకోసారి మొన్నటికి మొన్న రంగస్థలం షూటింగ్ కోసం సైరా షూటింగ్ ఆగింది. కారణం రత్నవేలు. డివోపి ఒక్కడే కావడంతో ఏం చేయలేకపోయాడు చిరంజీవి కూడా. ఇక ఇప్పుడు అన్నీ సిద్ధం.. మార్చ్ 5 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అన్నారు. కానీ 5 దాటి 5 రోజులు గడిచినా ఇప్పటికీ షూటింగ్ మొదలవ్వలేదు.
ఎందుకు అని అడిగితే.. మళ్లీ అదే సమాధానం.. అనుకోని కారణాలతో పోస్ట్ పోన్ అయిందని. ఆ అనుకోని కారణాలేవో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పర్ ఫెక్షన్ కోసం ప్రాణం పెడుతున్నారా.. లేదంటే లోలోపల ఏదైనా తేడా కొడుతుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందిప్పుడు. మరోవైపు ఈ చిత్ర యాక్షన్ సీన్స్ చిత్రీకరించే బాధ్యతను సురేందర్ రెడ్డి నుంచి కృష్ణవంశీకి చిరంజీవి ఇచ్చాడని తెలుస్తుంది. ఇప్పటికే కేరళలో జరగాల్సిన రెండో షెడ్యూల్ కాస్తా హైదరాబాద్ కు వచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరుగుంటే ఫిబ్రవరి 23 నుంచే మొదలవ్వాల్సిన సైరా రెండో షెడ్యూల్ ఇంకా కాలేదు. అమితాబ్ బచ్చన్ తో పాటు నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ లాంటి స్టార్స్ అంతా ఈ షెడ్యూల్ లోనే చిరుతో పాటు జాయిన్ కానుండటం విశేషం. ఇది భారీ షెడ్యూల్ అని తెలుస్తుంది. మరి చూడాలిక.. సైరా రెండో షెడ్యూల్ ఎప్పటికి మొదలయ్యేనో..? అన్నట్లు ఇందులో ఓ షెడ్యూల్ ను చైనాలో కూడా ప్లాన్ చేస్తున్నారు. అక్కడ షూటింగ్ చేసిన సినిమాలని చైనాలో విడుదల చేస్తే ట్యాక్స్ లో రిబేట్ వస్తుంది. అందుకే ఈ చైనా దండయాత్ర.