అలియా భట్ అంటే ఇన్నాళ్లూ ఓ ఇమేజ్ ఉండేది. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా నటిగా మాత్రం గుర్తుండిపోయే పాత్రలైతే చేయలేదు. హైవే లాంటి ఒకట్రెండు సినిమాలు తప్ప. కానీ ఇప్పుడు కెరీర్ లోనే ది మోస్ట్ సీరియస్ కారెక్టర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అది కూడా ఏకంగా ఇండో పాక్ కథలో.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రాజీ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. నిన్నమొన్నటి వరకు ఈ సినిమా వస్తున్నట్లు కూడా చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అలియా నటన చూసి మెచ్చుకోకుండా ఉండలేరు. 1971 ఇండో పాక్ వార్ నేపధ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమైన మెహబూబా కూడా ఇలాంటి కథే. కానీ రాజీ మాత్రం మరో కథ.
కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది. ఓ ఇండియన్ స్పై పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకొని దేశానికి ఏ విదంగా సహాయపడింది అనేదే ఈ చిత్ర కథ. నిజంగా జరిగిన కథ ఇది. చరిత్రలో చాలా జరుగుతాయి. కానీ అన్నింటికీ గుర్తింపు రాదు అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా వస్తుంది. కాలింగ్ సేహ్మత్ నోవేల్ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.
ట్రైలర్ అయితే పిచ్చెక్కించింది. భారతీయ స్త్రీ.. పాకిస్థాన్ భర్త.. ఇద్దరి మధ్యలో దేశం.. ఇంత సున్నితమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించింది మేఘనా. ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా చేసిన అలియాకు ఈ పాత్ర నిజంగా ఓ సవాలే. మరి సినిమాలో రాజీలో రాజీ లేకుండా అలియా ఎంతవరకు మెప్పించిందో చూడాలంటే మే 11 వరకు ఆగాల్సిందే..!