మన బలంతో పాటు బలహీనతలు కూడా తెలిసినపుడే జీవితంలో పైకి వస్తాం. అది తెలుసుకోకపోతే అలాగే మిగిలిపోతాం. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇది తెలియకే కెరీర్ తొలి నాళ్లలోనే ముగింపుకు వచ్చేస్తారు. స్వయంగా అక్కినేని నాగేశ్వరరావ్ అంతటి నటుడే ఎన్టీఆర్ తో పోటీ పడకుండా తాను కేవలం భక్తుడి వేషాలకే సరిపోతానని తనను తాను తక్కువ చేసుకున్నాడు. కాబట్టే అంత గొప్ప నటుడయ్యాడు. నటుడిగా తమకు తెలిసి ఉండాలి.. తాము ఏ పాత్రలకు సూట్ అవుతాం అని. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే రానా ఇది తెలుసుకున్నాడు. అందుకే కమర్షియల్ రూట్ అంటూ వాటిచుట్టూ తిరక్కుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు అల్లు శిరీష్ కూడా ఇదే రూట్ లో వెళ్తున్నాడు. మెగా హీరోల్లా మాస్ ఇమేజ్ మాత్రం అల్లు శిరీష్ కు ఊహించడం కష్టమే. అది తనకు రాదని కూడా ఈ హీరోకు బాగా తెలుసు.
అందుకే తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు అల్లు వారబ్బాయి. మాస్ కథలు.. కమర్షియల్ సినిమాలు అంటూ తన అన్న, బావలా లెక్కలేసుకోకుండా సింపుల్ గా తనకు నచ్చిన కథల్ని ఎంచుకుంటున్నాడు శిరీష్. ఒక్క క్షణం ఫ్లాప్ తర్వాత అది కూడా మానేసి.. సింపుల్ గా సైడ్ రోల్స్ అయినా పర్లేదంటున్నాడు శిరీష్. ఈ దారిలోనే గతేడాది మోహన్ లాల్ హీరోగా బోర్డర్ 1971 అనే మళయాల సినిమాలో నటించిన అల్లు శిరీష్.. ఇప్పుడు కేవీ ఆనంద్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇందులో సూర్య హీరో కాగా.. సపోర్టింగ్ రోల్ లో నటిస్తున్నాడు శిరీష్. దర్శకుడు ఆనంద్ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇందులో మోహన్ లాల్ కీలకపాత్రలో నటించబోతున్నాడు. మొత్తానికి హీరోగా సక్సెస్ కానంత మాత్రానా.. అలా సైలెంట్ అయిపోకుండా అన్ని భాషల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోతున్నాడు అల్లువారి చిన్నబ్బాయి.