అజ్ఞాతవాసి అంటే కనిపించకుండా ఉండటం అని అర్థం. సినిమాలో పవన్ అది చేసాడో లేదో తెలియదు కానీ గత మూడు రోజులుగా త్రివిక్రమ్ మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇంతగా విమర్శలు ఎదుర్కొంటోన్న త్రివిక్రమ్.. బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మాటల మాంత్రికుడు మాత్రం నిజంగానే ఇప్పుడు మాయమైపోయాడు. అజ్ఞాతవాసికి వచ్చిన రిపోర్ట్స్ చూసి త్రివిక్రమ్ చాలా ఫీలవుతున్నట్లు తెలుస్తుంది. నిజమే ఎలాంటి కథనైనా ఎంటర్ టైనింగ్ చెప్పే ఘనుడుగా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కు పేరుంది. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లలో చాలా సినిమాలు చేసాడు.. రాసాడు.. తీసాడు త్రివిక్రమ్. ఒక్కసారి కూడా అరే.. ఈ సినిమా ఎందుకు తీసాడ్రా.. అసలు త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా ఇదా అనే విమర్శలు ఇప్పటి వరకు రాలేదు కానీ తొలిసారి అది కూడా వచ్చిందిప్పుడు.
ఈ సినిమాను త్రివిక్రమ్ ఎందుకు తీసాడు.. ఏ నమ్మకంతో తీసాడు అని అడుగుతున్నారు అభిమానులు ఇప్పుడు. తలతోక లేకుండా వచ్చే సీన్స్ చూసి.. నిజంగా ఈ చిత్రం తీసింది త్రివిక్రమ్ శ్రీనివాసేనా అనే అనుమానం అయితే రాక మానదు. అంటే వరసగా విజయాలు వస్తున్నాయి కదా నేనేం తీసినా చూస్తారులే అనే అతి నమ్మకమే ఈ దర్శకుడి కొంపం ముంచేసిందా..? ఈయన తీసిన ఫ్లాప్ సినిమా ఖలేజా కూడా నవ్వులు పూయిస్తుంది. ఆ సినిమా అప్పటి పరిస్థితుల్ని బట్టి ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ ఇప్పటికీ మహేశ్ కెరీర్ లో సూపర్ ఎంటర్ టైనింగ్ సినిమా ఖలేజా. కానీ ఇప్పుడు అజ్ఞాతవాసి అలా కూడా లేదు. ఎందుకు తీసాడో తెలియని థీమ్ ప్రేక్షకుల సహనంతో ఆడుకుంది. ఇన్నేళ్ల ఇమేజ్ మొత్తం ఒకేఒక్క సినిమాతో పోగొట్టుకుంటున్నాడు త్రివిక్రమ్. ఈయన తర్వాతి సినిమా ఎన్టీఆర్ తో ఉంది. మరి ఈ చిత్ర ప్రభావం యంగ్ టైగర్ పై పడుతుందా..? ఆ సినిమాతో మాటల మాంత్రికుడు మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలిక..!