తూ షేర్ హై.. రోర్ రోర్.. అంటూ సంజూ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. నిజంగానే ఇప్పుడు ఆకలి మీదున్న సింహంలా బాక్సాఫీస్ ను దున్నేస్తున్నాడు రణ్ బీర్ కపూర్. సంజయ్ దత్ జీవితం గురించి తెలుసుకోడానికి ప్రేక్షకులు ఇంత ఆసక్తితో ఉన్నారా అనిపిస్తుంది ఇప్పుడు ఈ చిత్ర దూకుడు చూస్తుంటే. ఒకటి రెండు కాదు..
5 రోజుల్లోనే ఈ చిత్రం 210 కోట్ల మార్క్ అందుకుంది.. ఇప్పుడు సంజూ దూకుడు చూస్తుంటే ఎక్కడ ఆగుతుందో కూడా అర్థం కావట్లేదు. వీక్ డేస్ లో కూడా 25 కోట్లు.. 22 కోట్లు వసూలు చేసి ఔరా అనిపిస్తుంది ఈ చిత్రం. కళ తప్పిన బాలీవుడ్ బాక్సాఫీస్ ను చాలా రోజుల తర్వాత దుమ్ము దులిపేస్తుంది సంజూ సినిమా. రాజ్ కుమార్ హిరాణీ నుంచి వచ్చిన ఐదో అద్భుతం ఇది. దీనికి ముందు కూడా ఆయన చేసిన నాలుగు సినిమాలు రికార్డులు తిరగరాసాయి. ఇక ఇప్పుడు ఐదోసారి కూడా ఇదే చేస్తున్నాడు.
ఇవన్నీ ఇలా ఉంటే సినిమాలో కావాలనే సంజయ్ దత్ ను చాలా అమాయకుడిగా.. మంచివాడిగా చూపించాడనే విమర్శలు వస్తున్నాయి. ఆయన అక్రమ ఆయుధాల కేస్ లో పట్టుబడి.. జైల్లోనే కొన్నేళ్ల పాటు ఉన్నాడు.
కచ్చితంగా ఆయన తప్పు చేసాడు.. అది నిరూపించబడింది కూడా. అయితే సంజయ్ దత్ కు ఏమీ తెలియదు.. కేవలం తన ఆత్మరక్షణ కోసం దాచుకున్న ఆయుధాలను అక్రమంగా దాచుకున్నాడని చూపించి కావాలనే టెర్రరిస్ట్ ముద్ర వేసారని చూపించారు సినిమాలో.
అవన్నీ సంజయ్ దత్ కు తెలియకుండా ఎలా జరుగుతాయి..? అప్పటికి ఆయనేం చిన్న పిల్లాడు కాదు కదా.. అన్నీ తెలిసి చేసిన తర్వాత కూడా ఎందుకు సంజూను మంచి వాడిగా చూపించే ప్రయత్నం చేసారనేది అందరి నుంచి వస్తున్న ప్రశ్న. బయోపిక్ సంజూది కాబట్టి ఆయన మంచితనం ప్రూవ్ చేయడానికి ప్రాణ స్నేహితుడైనా రాజ్ కుమార్ హిరాణి ప్రయత్నించాడనేది అసలు ఆరోపణ.
అయితే సినిమాలో ఎమోషన్ అద్భుతంగా వర్కవుట్ అయింది.. నిజంగానే సంజయ్ దత్ అమాయకుడు అంతా కలిసి ఆయన్ని ఇరికించేసారు అనే విధంగా థియేటర్ నుంచి బయటికి వస్తారు ప్రేక్షకులు. మరి ఇందులో నిజాలేంటో కేవలం సంజయ్ దత్ కు మాత్రమే తెలుసు. బయోపిక్ లో కూడా అన్నీ అబద్ధాలే చూపిస్తే దానికి ఎవరూ ఏం చేయలేరు.. ఒకవేళ అదే నిజం అయితే మాత్రం నిజంగానే సంజయ్ జీవితం నాశనం అయిపోయిందని బాధపడాల్సిందే.