కచ్చితంగా ఎన్టీఆర్ ఒకప్పట్లా అయితే ఇప్పుడు లేడు. టెంపర్ తర్వాత ఆయనకేదో అయిపోయింది. అప్పటి ఎన్టీఆర్ అప్పుడే రిటైర్ అయిపోయాడు. టెంపర్ నుంచి తనను తానే మార్చుకున్నాడు జూనియర్. కథల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. దానికి ముందు ఇష్టమొచ్చిన నాసీరకం కథలు చేసి విమర్శల పాలైన ఎన్టీఆర్.. టెంపర్ నుంచి తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. అందుకే నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్.. జై లవకుశ లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా త్రివిక్రమ్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు యంగ్ టైగర్. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత కథ విషయంలో త్రివిక్రమ్ ను ఎన్టీఆర్ ఇబ్బంది పెడుతున్నాడని.. కథలో వేలు పెడుతున్నాడని.. త్రివిక్రమ్ కు స్వేచ్ఛ ఇవ్వట్లేదనే వార్తలొచ్చాయి. ఒకవేళ పాత ఎన్టీఆర్ అయితే ఇవన్నీ నిజమే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు యంగ్ టైగర్ అలా లేడు.
ఒకప్పుడు హిట్టిచ్చిన దర్శకులతో మాత్రమే పని చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఫ్లాప్ ఇచ్చిన వాళ్లతోనే సై అంటున్నాడు. గత కొన్నేళ్లుగా ఫ్లాప్ దర్శకులకే అవకాశాలిస్తున్నాడు జూనియర్. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అంతే. ఈ మధ్యే సినిమాపై వస్తోన్న వార్తల గురించి తన అభిమాన సంఘాల నాయకులతో మాట్లాడాడు ఎన్టీఆర్. బయట వినిపిస్తున్న వార్తలన్నీ నమ్మొద్దని.. తన సినిమా విషయంలో త్రివిక్రమ్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని చెప్పాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం బరువు తగ్గాలి కాబట్టి ఓ డైటీషియన్ సలహాతో తను ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జూనియర్ తన అభిమానులకు చెప్పాడు. ఇదే సందర్భంలో జూనియర్ తాను నటించే భవిష్యత్ సినిమాల కథలకు సంబంధించి ఎటువంటి పాత్రలు తాను నటిస్తే బాగుంటుంది అన్న సలహాలను కూడా అభిమానులను జూనియర్ అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి చివర్లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా మొదలు కానుంది. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటించబోతుంది..!