ఎప్పుడో గతేడాది పోస్టర్ విడుదల చేసారు.. త్వరలో విడుదల అని. ఆ త్వరలో ఇన్నాళ్లకు వస్తుందని ప్రేక్షకులు అనుకోలేదు. ఇండియాలోనే తొలి స్పేస్ సినిమాగా టిక్ టిక్ టిక్ చరిత్ర సృష్టించింది. జయం రవి హీరోగా భారీ బడ్జెట్ తో శక్తి సౌందరరాజన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఏడాది మొదటి నుంచే ఈ చిత్రం విడుదల అంటూ పోస్టర్లు విడుదల చేసారు. నిజానికి జనవరి 26న విడుదల కావాల్సిన సినిమా ఇది.
కానీ అనుకోని కారణాలతో ఆలస్యం అవుతూనే ఉంది. ఇక మధ్యలో స్ట్రైక్ కారణంగా మరోసారి వాయిదా పడింది. ఇక ఇన్నాళ్లకు దీనికి మోక్షం వచ్చింది. జూన్ 22న టిక్ టిక్ టిక్ విడుదల అంటూ పోస్టర్లు వచ్చాయి. ఈ సారి కచ్చితంగా వచ్చేలా కనిపిస్తుంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు సర్టిఫికేట్ ను అందుకుంది. తెలుగులో కూడా ఇప్పుడు వరుణ్ తేజ్-సంకల్ప్ రెడ్డి స్పేస్ థ్రిల్లర్ చేస్తున్నారు. దానికంటే ముందే టిక్ టిక్ టిక్ వస్తుంది. దాంతో ఈ చిత్ర ప్రభావం తమ సినిమాపై పడుతుందని కాస్త టెన్షన్ పడుతున్నారు వరుణ్ తేజ్ బ్యాచ్.
అయితే కథ విషయంలో కచ్చితంగా తేడా ఉంటుందని.. రెండూ ప్రేక్షకులకు మంచి అనుభవాన్నే ఇస్తాయంటున్నారు శక్తి బ్యాచ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీగానే విడుదల చేస్తున్నారు ఈ చిత్రాన్ని. రొటీన్ సినిమా కాదు కాబట్టి తెలుగులో కూడా టిక్ టిక్ టిక్ కు మంచి వసూళ్లు వస్తాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మరి చూడాలిక.. ఈ చిత్రంతో వరుణ్ సినిమాకు ఏదైనా నష్టం జరుగుతుందేమో.?