అదేంటి.. ఇండస్ట్రీకి ఎవరు బాకీ పడింది..? ఎవరు తీరుస్తారు అనుకుంటున్నారా..? ఇక్కడ బాకీ పడింది స్టార్ హీరోలే. ఒక్కసారి 2018ని లెక్క వేసుకోండి..! ఈ ఏడాది వచ్చి అప్పుడే 100 రోజులు దిగ్విజయంగా గడిచిపోయాయి. కానీ వచ్చిన బ్లాక్ బస్టర్లు లెక్క వేసుకోండి.. వేళ్లమీద లెక్క పెట్టుకోవడం కాదు.. అసలు లెక్క పెట్టుకోవడమే మానేయాలి. ఎందుకంటే ఈ ఏడాది స్టార్ హీరోలు పొడిచిందేం లేదు కాబట్టి. వచ్చిన ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ ఛలో. అది కూడా చిన్న సినిమా. ఈ సినిమా వసూలు చేసింది 12 కోట్లే. కానీ ఆ బడ్జెట్ కు అది చాలా ఎక్కువ. ఇదిలా ఉంటే 2018లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇక బాలయ్య జై సింహాతో ఏదో పర్లేదనిపించాడంతే. రవితేజ టచ్ చేసి చూడు చుట్టపు చూపులా వచ్చి వెళ్లింది. ఈ సమయంలో చిన్న సినిమాలే ఇండస్ట్రీ పరువును కాపాడుతున్నాయి. అనుష్క భాగమతి.. వరుణ్ తేజ్ తొలిప్రేమ.. ఇప్పుడు విడుదలైన నీదినాది ఒకేకథ.. ఇలా ఈ సినిమానే బాక్సాఫీస్ దగ్గర పరువు నిలబెడుతున్నాయి. దాంతో ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలన్నీ రంగస్థలం సినిమాపైనే ఉన్నాయి. మార్చ్ 30న విడుదల కానుంది ఈ చిత్రం. ఇది కానీ హిట్టైతే ఇండస్ట్రీ బాకీ తీర్చేసినట్లే. ఎందుకంటే రంగస్థలం ఆడితే కచ్చితంగా రేంజ్ 80 కోట్లు ఉంటుంది. అంత వసూలు చేస్తే ఇండస్ట్రీ బాకీ అంతా ఒక్కసారిగా తీరిపోయినట్లే..! చూడాలిక.. ఏం జరుగుతుందో..?