విడుదలకు నెల రోజుల ముందు టీజరే విడుదల చేయరు. కానీ నాగశౌర్య మాత్రం ఏకంగా వీడియో సాంగ్ విడుదల చేసాడు. అది కూడా టీజర్ కాదు.. పుల్ సాంగ్. కథపై ఎంత నమ్మకం ఉంటే నెల రోజుల ముందే పాటను విడుదల చేస్తారు చెప్పండి..? ఇది కూడా ఓ రకంగా ప్రమోషనే. బాలీవుడ్ లో ఈ తరహా ప్రమోషన్ ఉంటుంది. అక్కడ విడుదలకు ముందే సినిమా పాటలు పూర్తిగా వచ్చేస్తాయి. ఛలోకు కూడా చూసి చూడంగానే అంటూ రెండు నిమిషాల పాట విడుదల చేసి సినిమా హైప్ పెంచేసాడు. ఇప్పుడు ఏకంగా ఫుల్ సాంగ్ విడుదల చేసాడు నాగశౌర్య.
ఛలో తర్వాత ఈయన చాలా అంటే చాలానే మారిపోయాడు. ఈయన్ని చూస్తుంటే నిజంగా ఆ హీరో ఇతనేనా అనే అనుమానం వస్తుంది. నర్తనశాలతో ఆగస్ట్ 30న వస్తున్నాడు శౌర్య. శ్రీనివాస్ చక్రవర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సొంత బ్యానర్ లోనే ఈ చిత్రం చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పటికే షూటింగ్ కూడా చివరికి వచ్చేసింది. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా విశేషాలు తెలిపాడు శౌర్య. కాష్మీర్ పర్దేశీ హీరోయిన్.
పెద్దగా ఏం చెప్పలేదు కానీ ఒక్కమాట మాత్రం అనేసాడు. ఛలో తర్వాత వస్తుంది కదా.. ఇది కూడా రాసిపెట్టుకోండి అంటూ ధైర్యంగా చెప్పేస్తున్నాడు. ఒక్కసారి గెలుపు రుచికి అలవాటు పడిన తర్వాత వెనక్కి రావడం కష్టం. ఇన్నాళ్లూ నాగశౌర్యకు అది ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు. వచ్చిన సక్సెస్ లు కూడా అరకొరగానే వచ్చాయి. ఈ మధ్యే ఛలోతో నిఖార్సైన విజయం అందుకున్నాడు నాగశౌర్య.
అది కూడా సొంత బ్యానర్ లోనే. ఐరా సంస్థ అంటూ ఒకటి క్రియేట్ చేసి.. అందులోనే సినిమా చేసాడు శౌర్య. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మంచి లాభాలు తీసుకొచ్చింది. బయటి బ్యానర్స్ లో చేయడం వల్ల తన సినిమాలు సరైన ప్రమోషన్ లేక పోయాయంటున్నాడు శౌర్య. ఆ మధ్య వచ్చిన జాదూగాడు.. కళ్యాణ వైభోగమే లాంటి సినిమాలు పోవడానికి కారణాలు సరైన టైమ్ లో రిలీజ్ కాకపోవడమే అంటున్నాడు శౌర్య. అందుకే సొంతబ్యానర్ లోనే వరస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు ఈ హీరో. మొత్తానికి మరి ఛలోతో వచ్చిన సక్సెస్ ను నర్తనశాలతో కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలిక..!