తెలుగు సినిమాలకు ఈ మధ్య గోల్డెన్ టైమ్ నడుస్తుంది. మన సినిమాలకు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు అక్కడి దర్శక నిర్మాతలు. ఇప్పుడు మరో సినిమా కూడా హిందీలోకి వెళ్తుంది. అదే ప్రస్థానం. శర్వానంద్ ఇప్పుడంటే కమర్షియల్ హీరో అయ్యాడు కానీ అప్పట్లో ఆయన మంచి సినిమాల హీరో. అంటే కేవలం పేరు మాత్రమే వచ్చి.. డబ్బులు రాకపోవడం అన్నమాట. ఆ సమయంలో ఆయన నుంచి వచ్చిన సినిమా ప్రస్థానం. చాలా ఏళ్ళ కింద దేవాకట్టా తెరకెక్కించిన ఈ ప్రస్థానం తెలుగులో మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆడలేదు గానీ శర్వానంద్ కు ఈ సినిమా నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఇదే సినిమాలో సందీప్ కిషన్ నెగిటివ్ రోల్ చేసాడు. ఇక సాయికుమార్ కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన సినిమా ఇది. ఇదే సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. చాలా రోజులుగా వార్తల్లో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు అక్కడ వెళ్లడానికి రెడీ అయిపోయింది. అక్కడ ఖల్ నాయక్ సంజయ్ దత్ ప్రస్థానంలో సాయికుమార్ రోల్ చేయబోతున్నాడు. ఇక శర్వానంద్ పాత్రలో అలీ ఫాజల్ నటించనున్నాడు. సినిమా నచ్చి.. తనే రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు సంజూబాబా. అక్కడా దేవాకట్టానే దర్శకుడిగా ఉండబోతున్నాడు. ఇదే జరిగితే.. అసలే బ్యాడ్ టైమ్ లో ఉన్న దేవాకట్టాకు ప్రస్థానం హిందీ రీమేక్ ఓ వరమే. చూడాలిక.. మన దగ్గర ప్రశంసల దగ్గరే ఆగిపోయిన ప్రస్థానం.. బాలీవుడ్ ప్రస్థానం ఎలా ఉండబోతుందో..?