రైటర్ గా సక్సెస్ అయిన వాళ్లు దర్శకుడిగా దున్నేయాలని లేదు.. దర్శకుడిగా సక్సెస్ అయిన వాళ్లు రైటర్ గా కుమ్మేయాలని లేదు.. కొరటాల శివ, త్రివిక్రమ్ లాంటి వాళ్లు రెండింట్లోనూ కుమ్మేస్తున్నారు. కానీ అనిల్ రావిపూడి లాంటి వాళ్లు రైటర్ గా ఫెయిల్యూర్.. దర్శకుడిగా సూపర్ హిట్. ఈ లిస్ట్ లో బివిఎస్ రవి రివర్స్. ఈయన రచయితగా సక్సెస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ లాంటి హీరోలకు కూడా కథలు రాసాడు. కానీ దర్శకుడిగా మాత్రం రవిది ఫెయిల్యూర్ జర్నీ. ఈయన తెరకెక్కించిన రెండు సినిమాలు డిజాస్టర్లే. ఒకటి ఎనిమిదేళ్ళ కింద గోపీచంద్ హీరోగా వాంటెడ్.. రెండోది మొన్న వచ్చిన జవాన్.
వాంటెడ్ ఎప్పుడు వచ్చి ఎప్పుడెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ జవాన్ విషయంలో మాత్రం కావాల్సినంత క్రేజ్ వచ్చింది. పైగా సాయిధరంతేజ్ లాంటి హీరో ఉండటంతో బివిఎస్ రవి హిట్ కొట్టడం ఖాయం అనుకున్నారంతా. కానీ ఈ సారి కూడా అదృష్టం చిన్నచూపు చూసింది. జవాన్ కూడా కమర్షియల్ గా డిజాస్టర్ అయింది. 18 కోట్ల బిజినెస్ చేస్తే.. 10 కోట్లు కూడా వసూలు చేయలేక చేతులెత్తేసింది. దాంతో ఇప్పుడు బివిఎస్ రవి కెరీర్ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. సాయికి జవాన్ ఫెయిల్యూర్ తో వచ్చిన నష్టమేం లేదు.. ఈయనకు ఇంకా కరుణాకరణ్, వినాయక్ సినిమాలు చేతిలో ఉన్నాయి. కానీ రవి పరిస్థితి అలా కాదు. ఈయన కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే..! మరి ఇప్పుడు మళ్లీ దర్శకత్వం వైపు అడుగేస్తాడా.. లేదంటే రైటర్ గా తన పని తాను చూసుకుంటాడా అనేది చూడాలిక..!