ఆ మధ్య ఇండస్ట్రీలో ప్రతీ 15 రోజులకు ఒకసారి మీటింగ్స్ జరిగేవి. కుర్ర హీరోలు, హీరోయిన్లు అంతా కలిసి ఓ చోటికి వెళ్లి సినిమాల మీద చర్చించు కునేవాళ్లు. రానా, నితిన్ లాంటి వాళ్లే దీనికి ముందుండే వాళ్లు. ఓ హీరో సినిమా వస్తున్నపుడు.. మరో సినిమా రాకూడదు కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలి అనేది దీని సారాంశం. బహుశా ఇప్పుడు ఆ మీటింగ్స్ జరగడం లేదేమో అందుకే పోటీ బాగా ఎక్కువగా వస్తున్నారు మన హీరోలు. లేకపోతే మరేంటి.. ఓ సినిమా వస్తుందని తెలిసినా.. మరో సినిమా వస్తే నష్టపోతారనే జ్ఞానం ఉన్నా కూడా ఎవరికి ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలను.. కొందరు హీరోలను చూస్తుంటే వీళ్లకైమైనా పిచ్చి పట్టిందా అనిపిస్తుంది. థియేటర్స్ బోలెడు ఉన్నాయ్ అని ఒకరి మీద మరొకరు సినిమాలు పోటీకి వేస్తున్నారు. దానివల్ల రెండు సినిమాలకు నష్టం వస్తుంది.. ఒకవేళ ఓ సినిమా బాగుండి.. మరోటి బాగోలేకపోతే కనీసం ఓపెనింగ్స్ కూడా రాకుండా పోతుంది.
డిసెంబర్ 21 నుంచే ఈ వార్ మొదలుకానుంది. ఆ రోజు నాని ఎంసిఏ విడుదల కానుంది. నాని ఇప్పుడు ఉన్న రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాకు అడ్డు రావడం అంటే సూసైడల్ కిందే లెక్క. అలాంటిది డిసెంబర్ 22న హలో వస్తుంది. ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న అఖిల్.. నానితో పోరుకు సై అంటున్నాడు. మరో రిలీజ్ డేట్ దొరకనట్లు నాగార్జున కూడా తనయుడిని నానిపై యుద్ధానికి పంపిస్తున్నాడు. ఇక 2018, ఫిబ్రవరి 9న అంతే. ఆ రోజు నిఖిల్ కిరాక్ పార్టీతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం.. వరుణ్ తేజ్ తొలిప్రేమ రానున్నాయి. ఈ మూడు సినిమాలపై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి.
మార్చ్ 29..30 కూడా ఇలాంటి వార్ జరగబోతుంది. మార్చ్ 29న మహానటి విడుదల కానుంది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో తెలుగు వాళ్లందరికీ ఈ చిత్రంపై ఆసక్తి ఉంది. పైగా సావిత్రి జీవితంలో కన్నీళ్లు పెట్టించే ఘట్టాలు చాలానే ఉన్నాయి. వాటికి కనెక్ట్ అయితే మహానటి చరిత్రలో మిగిలిపోవడం ఖాయం. ఇక ఆ మరుసటి రోజే అంటే మార్చ్ 30న రంగస్థలం రానుంది. రామ్ చరణ్ కెరీర్ లోనే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా రంగస్థలం. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఈ రెండింటి మధ్య పోరు అన్నపుడే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
అన్నింటికంటే పెద్ద వార్ ఎప్రిల్ 27. ఆ రోజు బన్నీ నా పేరు సూర్య అంటూ వస్తున్నాడు. అందరికంటే ముందు ఆ డేట్ లాక్ చేసుకున్నది అల్లు వారబ్బాయే. వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ 10తో గోవా షెడ్యూల్ పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో చిన్న షెడ్యూల్ బాకీ ఉంది. ఇక బన్నీకి పోటీగా అదేరోజు రానున్న మరో హీరో మహేశ్ బాబు. ఈయన నటిస్తున్న భరత్ అనేనేను ఎప్రిల్ 27నే రానుందని మరోసారి కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. కొరటాల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. పైగా స్పైడర్, బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అన్నింటికి మించి ఇందులో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. బన్నీ, మహేశ్ కు పోటీగా రజినీకాంత్ 2.0తో రానున్నాడు. ఈ మూడు సినిమాలు ఒకే రోజు వస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుంది. చూడాలిక.. ఈ యుద్ధాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మలుపులు తిరగనున్నాయో.