ప్రతీవారం మాదిరే ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాల యుద్ధం బాగానే జరిగింది. అరడజన్ సినిమాలు విడుదలైనా అందరి కళ్లు మాత్రం రెండు సినిమాలపైనే ఉన్నాయి. ఈ రెండింటికి టాక్ బాగానే వచ్చింది. కానీ విజయం సాధించింది మాత్రం ఒక్కటే. అదే గూఢచారి. మరో అనుమానం లేకుండా.. పోటీ కూడా లేకుండా ఈ వారం విన్నర్ గా గూఢచారి నిలిచాడు. ఈ సినిమా ఇంటా బయటా రచ్చ చేస్తుంది.
ఓవర్సీస్ లో ఇప్పటికే 3 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. అడవిశేష్ లాంటి హీరోకు ఇంత మొత్తం అద్భుతమే. ఇక ఇండియాలో కూడా 3 కోట్లకు పైగానే షేర్ తీసుకొచ్చాడు శేష్. మొత్తానికి ఇప్పటికే 5 కోట్లకు పైగా గూఢచారి ఖాతాలోకి వెళ్లాయి.
వీక్ డేస్ లో కూడా ఈ సినిమా వసూళ్లు తగ్గడం లేదు. మరోవైపు ఈ వారమే వచ్చిన చిలసౌకు మంచి టాక్ వచ్చినా కమర్షియల్ గా మాత్రం వెనకబడిపోయింది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సుశాంత్ హీరోగా నటించాడు. ఈయన గత చరిత్ర ఈ సినిమాపై ప్రభావం చూపించింది.
సినిమా బాగుందని చెప్పినా కూడా ప్రేక్షకులు థియేటర్స్ కు రాలేదు. దాంతో మంచి సినిమా చేసాననే సంతృప్తి మిగిలింది కానీ హిట్ కొట్టాలనే ఆశైతే తీరలేదు ఈ అక్కినేని మేనల్లుడికి. మారుతి కథ అందించిన బ్రాండ్ బాబు డిజాస్టర్ గా నిలిచింది. కనీసం దీనికి పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. మొత్తానికి ఈ వారం గూఢచారి దున్నేస్తున్నాడు.