సంక్రాంతి సీజన్ ముగిసిందంటే మళ్లీ అందరి చూపు సమ్మర్ పైనే ఉంటుంది. సమ్మర్ అంటే కూడా ఎప్రిల్ అని అర్థం. ఎందుకంటే అప్పటికే పరీక్షలన్నీ పూర్తై.. హాలీడేస్ వస్తాయి స్టూడెంట్స్ కు. సాధారణంగా మన సినిమాలకు మహారాజ పోషకులు వాళ్లే కాబట్టి పరీక్షలు పూర్తైన తర్వాత సినిమాలు విడుదల చేస్తుంటారు. కానీ ఇప్పుడు దర్శక నిర్మాతల తీరు మారుతుంది. మార్చ్ లోనే సినిమాలు తీసుకొస్తున్నారు. అన్ సీజన్ గా భావించే టైమ్ లో వరసగా సినిమాలు తీసుకొస్తున్నారు. వాళ్ల ధైర్యం ఏంటో కానీ వరస రోజుల్లో సినిమాలు విడుదల చేస్తున్నారు. మార్చ్ వార్ ను ముందు తెరతీసింది మాత్రం రామ్ చరణే. ఈయన రంగస్థలం మార్చ్ 30న వస్తున్న సంగతి తెలిసిందే.
మరో రెండు సినిమాలు దాని ముందు రోజులు వస్తున్నాయి. మార్చ్ 29న మహానటి రానుంది. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఆసక్తి బాగానే ఉంది. సినిమాను తక్కువగా అంచనా వేయడానికి కూడా లేదు. కీర్తిసురేష్, సమంత కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దాంతో సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఇక మార్చ్ 28న కళ్యాన్ రామ్ ఎమ్మెల్యే విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తో బిజీగా ఉంది సినిమా. ఈ మధ్యే విడుదలైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత రంగస్థలం విడుదల కానుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పోస్టర్స్ నుంచి అన్నీ కొత్తగా డిజైన్ చేస్తున్నాడు సుకుమార్. కచ్చితంగా ఈ చిత్రం చరణ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని భావిస్తున్నాడు ఆయన. సమంత ఇందులో హీరోయిన్. ఒక రోజు గ్యాప్ లో తన సినిమాతో తానే పోటీ పడబోతుంది సమంత. మొత్తానికి మార్చ్ 28.. 29.. 30 తేదీల్లో మాత్రం క్రేజీ మూవీస్ ప్రేక్షకులకు విందు ఇవ్వబోతున్నాయి. మరి చూడాలిక.. వీటిలో ఏది విజేతగా నిలుస్తుందో..?