అవును.. నిజంగానే ఇప్పుడు ఎన్టీఆర్ ఇగోను టచ్ చేస్తున్నాడు మారుతి. అదేంటి అనుకుంటున్నారా..? ఏం లేదండీ.. మారుతి తర్వాతి సినిమా అంతా ఇగో చుట్టూనే తిరుగుతుందని తెలుస్తుంది. ఇగో అంటే మనకు టాలీవుడ్ లో ముందుగా గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. టెంపర్ లో ఈయన చూపిన ఇగో మరెవరూ చూపించలేదు. పైగా దానిపై అదిరిపోయే డైలాగులు కూడా చెప్పాడు యంగ్ టైగర్. దాంతో ఇగోకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు మన జూనియర్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు మారుతి. తెలుగు ఇండస్ట్రీలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలంటే మారుతి తర్వాతే ఎవరైనా అనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన చేసినవన్నీ ఇలాంటి సినిమాలే.
ఒకప్పుడు జంధ్యాల.. ఇవివి సత్యనారాయణ లాంటి దర్శకులు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే వాళ్లు. వీళ్ల సినిమాల్లో కథలు ఎక్కువగా ఉండేవి కాదు.. సింపుల్ గా ఓ కాన్సెప్ట్ తీసుకోవడం దాన్ని అల్లుకుంటూ కథ వెళ్లిపోవడం.. ఇదే చేసారు. అలాగే హిట్లు కొట్టారు కూడా. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు తెలుగులో. మళ్లీ దానికి మంచి రోజులు తీసుకొస్తున్నాడు మారుతి. ఈయన సినిమాల్లోనూ కథలు ఉండవు.. కేవలం కాన్సెప్టులే ఉంటాయి. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ కాన్సెప్ట్ తీసుకుని కథ రాసుకుంటాడు. మతిమరుపు.. స్వార్థం.. జాలి.. అతిజాగ్రత్త.. ఇవే మారుతి కాన్సెప్టులు.. కథలు కూడా. వీటినే ఎంటర్ టైనింగ్ గా చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. మహానుభావుడులో శర్వానంద్ ను అతిజాగ్రత్త పరుడిగా చూపించి హిట్ కొట్టాడు.
త్వరలోనే నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు మారుతి. ఈ ఏడాది ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాంతో హిట్ కొట్టాడు చైతూ. ప్రస్తుతం సవ్యసాచిలో నటిస్తున్నాడు ఈ హీరో. చందూమొండేటి దీనికి దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇది సెట్స్ పై ఉండగానే మారుతి సినిమాకు ఓకే చెప్పాడు చైతూ. ప్రేమమ్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్మెంట్స్ మారుతి-చైతూ సినిమాను కూడా నిర్మించబోతుంది. ఈ సంస్థలో ఇప్పటికే బాబుబంగారం చేసాడు మారుతి. ఇప్పటికే కథ ఫైనల్ అయిపోయింది. ఇందులో చైతూను ఇగోయిస్టిక్ ఫెల్లోగా చూపించబోతు న్నాడు మారుతి. ఇగో చుట్టూనే కథ అల్లుకున్నాడని తెలుస్తుంది. మరి చూడాలిక.. మనిషికి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఇగో ఉంటే ఏమవు తుందో..?