నందమూరి తారకరామారావు.. తెలుగు వాళ్ల ఆశ.. శ్వాస ఈ పేరు. ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడు ఉన్నా కూడా ఈ పేరును గర్వంగా చెప్పుకుంటాడు. అంతగా తెలుగుదనం ఉట్టిపడే నాయకుడు నందమూరి తారాకరామారావు. అలాంటి వ్యక్తి జీవితం తెరపై ఆవిష్కృతం అవుతుంది అంటే ఎన్నేళ్ల శ్రమ ఉండాలి..? ఓ వైపు సావిత్రి జీవితం కోసం ఏకంగా రెండేళ్లు శోధించాడు నాగ్ అశ్విన్. ఎన్నో విషయాలు సేకరించాడు.
దాన్ని తెరకెక్కించడానికి మరో ఏడాది తీసుకున్నాడు. అంటే మహానటి కోసం మూడేళ్లు వెచ్చించాడు ఈ దర్శకుడు. మరి అలాంటిప్పుడు ఎన్టీఆర్ కోసం ఇంకెన్నేళ్లు కూర్చోవాలి..? కానీ ఇక్కడ సీన్ మాత్రం మరోలా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ ను కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నాడు బాలకృష్ణ. ఇదే జరిగితే ఇది నిజంగా అద్భుతమే.. అదే క్రమంలో పెద్ద సాహసమే..!
ఎందుకంటే అన్నగారి జీవితం అంటే ఎన్నో విశేషాలు ఉంటాయి.. అంత తక్కువ టైమ్ లో సినిమాలో ఉండే విధంగా.. అభిమానులు మెచ్చే విధంగా తెరకెక్కించడం అనేది చిన్న విషయం అయితే కాదు. కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ను దసరాకు మొదలుపెట్టి.. సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. పైగా ఇప్పుడు వినాయక్ సీన్ లోకి వచ్చాడు సడన్ గా..! ఈయనతో సినిమాను ఇప్పుడు మొదలుపెట్టి దసరాకు విడుదల చేస్తానంటున్నాడు.
అంటే మూడు నెలల్లో వినాయక్.. మూన్నెళ్లలో క్రిష్ తో ఎన్టీఆర్ బయోపిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు బాలయ్య. ఇది నిజంగా జరిగే పనేనా..? ఈ క్రమంలో వినాయక్ సినిమా తేడా కొట్టినా పెద్దగా పట్టించుకోరు కానీ ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం ఏదైనా తేడా జరిగితే అభిమానులు తట్టుకుంటారా..? ఏమో తండ్రి సినిమా అంత రిస్క్ అని తెలిసి కూడా ధైర్యంతో మొండిగా ముందడుగేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. మరి చూడాలిక.. ఈయనకు ఆ తండ్రి ఆశీస్సులు ఎంత వరకు ఉంటాయో..?