ఎన్టీఆర్ బయోపిక్ అనగానే అందర్లోనూ ఒకటే ఆసక్తి.. ఎలా ఉండబోతుంది పెద్దాయన సినిమా..? ఆయన జీవితం తెలుగు వాళ్లకు తెరిచిన పుస్తకం. అన్నగారి జీవితంలోని అన్ని కోణాలు తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయన జీవితంలో ఎన్నో కోణాలున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ చూడని కోణాలు కూడా ఎన్టీఆర్ జీవితంలో ఉన్నాయి. అవి కేవలం కొందరికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్ జీవితం అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది ఆయన రాజకీయ జీవితమే.. అందులో గెలిచిన విజయం.. ఇరుక్కున్న వివాదం.. ముగిసిన జీవితం.. ఇవే ఎన్టీఆర్ జీవితం అంటే గుర్తొస్తాయి ఎవరికైనా..! ఇప్పుడు ఇవన్నీ ఎన్టీఆర్ బయోపిక్ లో ఉంటాయా అంటే సమాధానం లేదనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తోన్న బయోపిక్ లో కేవలం ఎన్టీఆర్ విజయాన్ని మాత్రమే చూపించనున్నాడు బాలయ్య. ఆయన జీవితంలోని చీకటిని మూసేసి.. కేవలం వెలుగును మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఆయన పుట్టింది.. పెరిగింది.. ఇండస్ట్రీకి వచ్చింది.. ఇక్కడ ఎదిగింది.. పార్టీ పెట్టింది.. విజయం సాధించింది.. ముఖ్యమంత్రి అయింది.. ఇక్కడితోనే ఎన్టీఆర్ బయోపిక్ ముగుస్తుందని తెలుస్తుంది. కానీ ఎన్టీఆర్ జీవితంలో అసలు ఆసక్తికరమైన విషయాలు మొదలైందే ఆయన సిఎం అయిన తర్వాత..! కానీ అక్కడితోనే ఈ బయోపిక్ ముగిస్తే ప్రేక్షకులకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. మరి దీనిపై బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మార్చ్ 29న రామకృష్ణ స్టూడియోస్ లో ఎన్టీఆర్ బయోపిక్ కు ముహూర్తం పెట్టనున్నాడు బాలయ్య. తేజ దీనికి దర్శకుడు. బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ పై బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. చూడాలిక.. పెద్దాయన జీవితం స్క్రీన్ పై ఎలా ఉండబోతుందో..?