సినిమా ఎలా ఉన్నా పర్లేదా.. సినిమాలో నాని ఉంటే సరిపోతుందా..? ఆయనకు తోడుగా సాయిపల్లవి ఉండటం కూడా ఎంసిఏకు కలిసొచ్చిందా..? ఏమో ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. సినిమా విడుదలై నాలుగు రోజులు గడిచినా.. హలో లాంటి సినిమా పోటీకి వచ్చినా.. సినిమా యావరేజ్ అంటూ రివ్యూలు రాసినా.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర న్యాచురల్ స్టార్ రచ్చ కొనసాగుతుంది. బిలో యావరేజ్ టాక్ తో మొదలైన ఎంసిఏ కలెక్షన్ల వేటలో దూసుకెళ్లిపోతుంది. మరోవైపు బాగుంది అనే టాక్ తెచ్చుకున్న హలో వెనకాల పడిపోయింది. మిడిల్ క్లాస్ అబ్బాయి దూకుడు చూసి ఇండస్ట్రీ జనాలతో పాటు నాని కూడా షాక్ అవుతుంటాడు. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం అక్షరాలా 17.72 కోట్ల షేర్ వసూలు చేసింది. అది కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే. నేనులోకల్, నిన్నుకోరి లాంటి సినిమాల తొలి వారం వసూళ్లను ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే దాటేసింది. ఇక ఓవర్సీస్ కూడా కలిపితే ఈ లెక్క 21 కోట్లకు చేరిపోయింది. అక్కడ ఇప్పటికే 7 లక్షల డాలర్లు వసూలు చేసి.. మిలియన్ మార్క్ వైపు పరుగులు తీస్తున్నాడు మిడిల్ క్లాస్ అబ్బాయి. క్రిస్ మస్ సెలవులు పూర్తయ్యే లోపు 26-27 కోట్ల వరకు వసూలు చేయడం ఖాయం. మరో 3 కోట్లు మిగిలిన రోజుల్లో తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు. ఈ లెక్కన నాని ఖాతాలో వరసగా ఎనిమిదో విజయం కూడా చేరిపోయినట్లే. ఎంసిఏ సేఫ్ అవ్వాలంటే 30 కోట్లు వసూలు చేయాలి. అది పెద్ద కష్టమయ్యేలా కనిపించట్లేదు.