ఒకేసారి ఒకే నేపథ్యం ఉన్న కథలు చేయడం అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఇదే జరగబోతుంది ఇండస్ట్రీలో. ఒకేసారి హీరోలంతా క్రికెట్ నేపథ్యం ఉన్న కథల వైపు అడుగేస్తున్నారు. అప్పుడెప్పుడో 15 ఏళ్ల కింద వసంతంలో వెంకటేశ్ క్రికెటర్ గా నటించాడు. ఆ తర్వాత మళ్లీ ఏ హీరో కూడా క్రికెట్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల్లో నటించలేదు. మొన్నీమధ్యే శ్రీవిష్ణు అప్పట్లో ఒకడుండేవాడు అంటూ క్రికెటర్ గా వచ్చాడు.
ఇప్పుడు ఒకేసారి ముగ్గురు హీరోలు క్రికెట్ తో వస్తున్నారు. అందులో అంతా క్రేజీ హీరోలే ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. నాని ఇప్పుడు అర్జున్ గా వస్తున్నాడు. జెర్సీ నెంబర్ 36తో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా 1985-95 మధ్యలో జరుగుతుంది. ఆ రోజుల్లో ఇండియన్ టీమ్ లోకి రావాలని కలలు కనే ఓ కుర్రాడి కథ ఇది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.
ఇక నాగచైతన్య-శివనిర్వాణ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కూడా క్రికెట్ నేపథ్యం ఉండబోతుంది. ఈ చిత్ర కథ కూడా పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో సాగబోతుంది. ఇందులో సమంత హీరోయిన్ గా నటించబోతుంది. ఇదే ఏడాది సినిమా పట్టాలెక్కబోతుంది.
జెర్సీ కంటే ముందే నాగచైతన్య సినిమా విడుదల చేయాలని శివ ప్లాన్ చేస్తున్నాడు కానీ అది అంత ఈజీ కాకపోవచ్చు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ కూడా భరత్ కమ్మ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమాలో క్రికెటర్ గా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ముగ్గురు కుర్ర హీరోలు ఒకేసారి క్రికెట్ ను నమ్ముకోవడం మాత్రం కాస్త ఆసక్తికరమే. మరి చూడాలిక.. వీళ్లలో ఎవరి క్రికెట్ ప్రేక్షకులకు నచ్చుతుందో..?