రజినీకాంత్ సినిమా వచ్చిందంటే కచ్చితంగా కొత్త రికార్డులు వస్తాయి. ఆయన సినిమా ఎలా ఉంది అని ఎవరూ అడగరు.. ఎలా ఉన్నా తొలిరోజు రికార్డులన్నీ కదిలిపోవాల్సిందే. కానీ ఈ సారి మాత్రం అది జరగలేదు. ఎందుకో తెలియదు కానీ ముందు నుంచి కాలా కాస్త తక్కవ అంచనాలతోనే వచ్చింది. ఇప్పుడు దీనికి ఫలితం కూడా కనిపిస్తుంది. తొలిరోజు ఈ చిత్రం ఎక్కడా రికార్డు వసూళ్లు అయితే సాధించలేదు.
తెలుగులో కబాలి ఏకంగా 10 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అప్పట్లో అది చాలా ఎక్కువ ఓ డబ్బింగ్ సినిమాకు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే తెలుగులో తొలిరోజు కాలాకు 6 కోట్ల షేర్ కూడా రావడం కష్టమే. తమిళనాట మాత్రం కాలాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. కానీ ఓవర్సీస్ లో మాత్రం కబాలితో పోలిస్తే సగం కూడా తీసుకురాలేదు కాలా. ఆ సినిమా ప్రీమియర్స్ తోనే 1.9 మిలియన్ తీసుకొస్తే..
ఇది కేవలం 6 లక్షల డాలర్స్ తో సరిపెట్టుకుంది. పైగా సినిమా కూడా యావరేజ్ టాక్ తోనే మొదలైంది. తమిళనాట రజినీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ తో ఎలాగోలా కబాలిలా కమర్షియల్ గా లాగేస్తుందేమో కానీ అభిమానులు కోరుకున్న సినిమా మాత్రం మళ్లీ ఇవ్వలేకపోయాడు రంజిత్.