నా సినిమా సూపర్ హిట్ అని టైటిల్ పెట్టుకుని సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోదు.. అందులో మ్యాటర్ కూడా సూపర్ హిట్ అయ్యేంత ఉండాలి. లేకపోతే టైటిల్ లో ఉన్న సూపర్ హిట్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు కిరాక్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంది. అంటే సినిమా బాగోలేదా అంటే లేదు అని చెప్పలేం. ఉందంటే ఉంది అంతే. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి..
సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కాబట్టి.. నిఖిల్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి.. చందూమొండేటి, సుధీర్ వర్మ లాంటి దర్శకులు పనిచేసారు కాబట్టి.. ఇన్ని బట్టిలు ఉన్నాయి కాబట్టి కిరాక్ పార్టీ ఒక్కసారికి ఓకే అనిపిస్తుంది. కానీ ముందు నుంచి ఊహించుకున్నట్లు మాత్రం ఈ సినిమా అంత స్థాయిలో లేదు. నిఖిల్ నుంచి ఇంతకంటే ఎక్కువే ఊహించారు. దానికి కారణం కూడా లేకపోలేదు.
కన్నడలో చరిత్ర సృష్టించిన సినిమా అని ప్రచారం చేయడంతో ఏం ఉంటుందో అని థియేటర్స్ కు వెళ్లిన ప్రేక్షకులు కిరాక్ పార్టీ చూసి ఒకింత నిరాశపడడం మాత్రం ఖాయం. అయితే పూర్తిగా మాత్రం కాదు. సినిమా ఫస్టాఫ్ అంతా ఎంటర్ టైనింగ్ గా వెళ్లిపోయినా.. కీలకమైన సెకండాఫ్ మాత్రం నెమ్మదించింది. కథ లేక.. ముందుకెళ్లలేక వెనక్కి వెళ్లలేక మొరాయించింది. సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా దీనికి మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయేమో కానీ నిఖిల్ కోరుకున్న బ్లాక్ బస్టర్ మాత్రం కిరాక్ పార్టీతో కష్టం. మరి చూడాలిక.. ఈ టాక్ తో సినిమా ఎంత వరకు లాక్కొస్తుందో..?