యాక్షన్.. ఫ్యాక్షన్.. లవ్.. ఫ్యామిలీ.. ఇలా ఎన్ని రకాల సినిమాలు చేసినా ముందు అన్నింట్లోనూ మహారాజ పోషకులు యూత్. వాళ్లకు నచ్చితే సినిమా రేంజ్ మారిపోతుంది. అర్జున్ రెడ్డి దీనికి నిదర్శనం. ఆ సినిమాను కుటుంబ ప్రేక్షకులు ఎవరూ చూసుండరు. కానీ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే రూట్ లో యూత్ కోసమే మరో సినిమా సిద్ధమైంది. కాలేజ్ లో జరిగిన గొడవలు.. ప్రేమలు అన్నీ గుర్తు చేసేలా కిరాక్ గా వస్తుంది కిరాక్ పార్టీ. ఈ రోజుల్లో సినిమాను పోలిన సినిమాలు రావడం కామన్. ఎందులోనూ మనకు కొత్త సీన్స్ అయితే కనిపించవు. కచ్చితంగా ఓ సినిమాను మరో సినిమాతో పోల్చుకోవాల్సిందే. ఇప్పుడు విడుదలైన కిరాక్ పార్టీ ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఇదే అనిపిస్తుంది. ఈ చిత్రం అచ్చంగా హ్యాపీడేస్ ప్లస్ శివను తలపిస్తుంది.
ఆ సినిమాల్లో కనిపించిన సీన్లే ఇందులోనూ కనిపిస్తున్నాయి. శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రానికి చందూమొండేటి డైలాగులు రాసాడు.. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీకి రీమేక్ ఇది. ఈ చిత్ర ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు కచ్చితంగా పెరగడం ఖాయం. అయితే హ్యాపీడేస్ ఛాయలు మాత్రం చాలానే కనిపిస్తున్నాయి. ఇక గొడవల దగ్గరికి వచ్చేసరికి వద్దన్నా శివ సినిమా గుర్తొస్తుంది. దాంతో కిరాక్ పార్టీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఈ చిత్రం మార్చ్ 16న విడుదల కానుంది. ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కావడంతో సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ వస్తాయని నమ్ముతున్నాడు దర్శక నిర్మాతలు. మరి చూడాలిక.. ఈ చిత్రంతో నిఖిల్ ఎలాంటి మాయ చేస్తాడో..?