ఒక్కటి రెండు మూడు.. అంటూ ఒక్కో హిట్ కొడుతూ మెల్లగా స్టార్ డైరెక్టర్ గా మారుతున్నాడు అనిల్ రావిపూడి. అదేంటో కానీ ఈయన రైటర్ గా ఉన్నపుడు ఒక్క హిట్ కూడా రాలేదు. కనీసం గుర్తింపు కూడా రాలేదు. కానీ మెగాఫోన్ పట్టగానే జాతకం కూడా మారిపోయింది. ఫుల్ పటాస్ లా ఈయన దూకుడు మొదలైంది. తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన అనిల్.. ఆ తర్వాత కూడా సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు. ఈ రోజుల్లో ఒక్క హిట్ కొట్టడమే గగనం. కానీ వరసగా మూడు విజయాలందుకున్నాడు అనిల్. అది కూడా రొటీన్ కమర్షియల్ కథలతో. ఒక్కో సినిమాలో ఒక్కో కథ.. కానీ అన్నింట్లోనూ ఎంటర్ టైన్మెంట్ కామన్. మనోడు ఓకే అనాలే కానీ స్టార్స్ కూడా సై అంటున్నారు ఈ దర్శకుడితో పని చేయడానికి. అయితే ఒకేసారి స్టార్స్ ను పట్టేసి స్టార్ డైరెక్టర్ అయిపోవాలనే ఆలోచన ఈ కుర్రాడికి లేనట్లుంది. అందుకే ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఈయన ఓ మల్టీస్టారర్ సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. దీనికి ఎఫ్ 2 అనే విచిత్రమైన టైటిల్ కూడా పెట్టాడు. అంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అన్నమాట.
ఈ సినిమా అనౌన్స్ అయి కూడా ఆర్నెళ్లు దాటిపోయింది. ఇప్పుడు దీనికి కార్యరూపం వచ్చేలా కనిపిస్తుంది. ఉగాది సందర్భంగా అనిల్ కొత్త సినిమా ఓపెన్ అయ్యేలా కనిపిస్తుంది. వరుణ్ తేజ్, వెంకటేశ్ తో ఈ మల్టీస్టారర్ ఉంటుందేమో అనే ఊహాగానాలు నడుస్తున్నాయి ఇండస్ట్రీలో. పైగా అనిల్ రావిపూడి గతంలో వెంకీ హీరోగా నటించిన మసాలా సినిమాకు మాటలు రాసాడు. అందులో వెంకటేశ్ పలికిన బట్లర్ ఇంగ్లీష్ డైలాగులు బాగానే పేలాయి. ఆ పరిచయం ప్లస్ ఇప్పుడు అనిల్ ట్రాక్ రికార్డ్ చూసి అతడికి వెంకీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మరో హీరో దిల్ రాజు ఆస్థాన వరుణ్ తేజ్ అని తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ఫిదా చేసిన దిల్ రాజు.. తొలిప్రేమను కూడా తనే తీసుకున్నాడు. ఆయన అడిగితే వరుణ్ తేజ్ నో చెప్పే సమస్యే ఉండదు. ఎలా చూసుకున్నా కూడా అనిల్ రావిపూడి చేయబోతున్న ఆ మల్టీస్టారర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఈ ఫన్ అండ్ ప్రస్టేషన్ ఎలా ఉండబోతుందో చూడాలిక.