మనం మాట్లాడుకుంటున్నది ఆకాశ్ గురించే. పూరీ జగన్నాథ్ తనయుడు ఈయన. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు హీరోల కొడుకులే హీరోలయ్యారు.. నిలబడ్డారు. కానీ నిర్మాతలు, దర్శకుల కొడుకులు చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు. వెంకటేశ్.. జగపతిబాబు.. అల్లరి నరేష్ తర్వాత అలా స్టార్ అయిన వాళ్లు లేరు. ఇప్పుడు తాను ఉన్నానంటూ ముందుకొస్తున్నాడు ఆకాశ్ పూరీ. ఈయన దర్శకత్వం వైపు వెళ్తాడేమో అనుకుంటే..
కాదని హీరోగా వచ్చేస్తున్నాడు. 20 ఏళ్లు కూడా లేని ఈ కుర్రాడు మెహబూబా సినిమాతో హీరో అయ్యాడు. పూరీ జగన్నాథ్ ప్రత్యేకంగా తన కొడుకు కోసం ఇండో పాకిస్థాన్ కథ రాసుకుని మరీ తీసాడు మెహబూబా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. పూరీ పాత కథల మాదిరి లేదు ఇది.
కచ్చితంగా తనయుడి కోసం బాగా ఆలోచించి మరీ రాసుకున్నట్లున్నాడు అందుకే మెహబూబా బాగా కొత్తగా కనిపిస్తుంది. పైగా ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. ఇది ఇంకాస్త అంచనాలు పెంచేస్తుంది. ఇవన్నీ పక్కనబెడితే ఆంధ్రాపోరీలో చిన్న పిల్లాడిలా కనిపించిన ఆకాశ్.. ఇప్పుడు మాత్రం హీరోగా మారిపోయాడు.
ఈ కుర్రాన్ని చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీకి మరో హీరో దొరికినట్లే అనిపిస్తుంది. మెహ బూబా కానీ హిట్టైందంటే కచ్చితంగా ఆకాశ్ కూడా తన ఉనికి చాటుకోవడం ఖాయం. ఎలాగూ తండ్రి పూరీ అండదండలు ఉండనే ఉన్నాయి. తొలి సినిమా హిట్టైతే అదే ఊపులో తనయున్ని నిలబెట్టడానికి మరో రెండు మూడు సినిమాలైనా చేస్తాడు పూరీ.. అప్పట్లో ఇవివి సత్యనారాయణ తన కొడుకు అల్లరి నరేష్ కోసం చేసినట్లు..! మరి చూడాలిక.. తండ్రి నమ్మకాన్ని ఆకాశ్ ఎంతవరకు నిలబెట్టుకుంటాడో..?