నాని ఇప్పుడు హీరో కాదు.. స్టార్.. న్యాచురల్ స్టార్. ఒకప్పుడు ఆయన సినిమాలు బాగున్నాయి అని తెలిసిన తర్వాత కలెక్షన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నా కలెక్షన్లు వస్తున్నాయి. అదే హీరోకు.. స్టార్ కు ఉన్న తేడా. మాస్ ఫాలోయింగ్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని నాని కూడా మెంటల్ గా ఫిక్స్ అయినట్లున్నాడు.
అందుకే రొటీన్ కథలతోనే ముందుకొస్తున్నాడు ఈ హీరో. ఒకప్పుడు కొత్త కథలు మాత్రమే చేస్తూ పేరు తెచ్చు కున్న నాని.. ఇప్పుడు స్టార్ అయ్యాక మాస్ కథలే చేస్తున్నాడు. ఇప్పటికే గతేడాది నేనులోకల్.. ఎంసిఏ లాంటి రొటీన్ కథలతోనే బాక్సాఫీస్ ను కుమ్మేసాడు నాని. అయితే విజయంతో పాటు విమర్శలు కూడా వచ్చాయి ఈ సినిమాలతో. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ విడుదలైంది.
ఇది చూస్తుంటే మరోసారి రొటీన్ కథతోనే వస్తున్నట్లు అర్థమైపోతుంది. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నాని ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది. ఇద్దరు నానిలను బాగానే మేనేజ్ చేసాడు దర్శకుడు. తిరుపతిలో ఉండే మాస్ కృష్ణుడు.. యూరప్ లో ఉండే క్లాస్ అర్జునుడు.. ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చే ఇటాలియన్ మాఫియా ఇదే కృష్ణార్జున యుద్ధం కథ.
టైటిల్ లో చెప్పినట్లు కృష్ణుడు.. అర్జునుడు యుద్ధం చేయరు. ఇద్దరూ కలిసి ఇంకొకళ్ళపై యుద్ధం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ ధిల్లన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్రిల్ 12న సినిమా విడుదల కానుంది. చూడాలిక.. ఈ సినిమాతో నాని ట్రిపుల్ హ్యాట్రిక్ పూర్తి చేస్తాడో లేదో..?