కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఇద్దరి పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే దేవీ శ్రీ ప్రసాద్ లేదంటే థమన్. వీళ్ళూ కాదంటే అనూప్ రూబెన్స్. కొన్నేళ్లుగా ఇదే తంతు. రొటీన్ మ్యూజిక్ అని తెలిసినా.. ఆప్షన్ లేక మన దర్శకనిర్మాతలు కూడా వాళ్లకే అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కొత్త సంగీత తరంగాలు మన ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి. వాళ్ల బాణీలు ఇక్కడ వీనులవిందుగా వీస్తున్నాయి. ఆ సౌండ్స్ కు మన దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా కరిగిపోతున్నారు.
ఈ మధ్య కాలంలో తెలుగులో కొందరు కొత్త సంగీత దర్శకులు తమ సత్తా చూపిస్తున్నారు. భలేభలే మగాడివోయ్, మళ్లీమళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమాలతో గోపీసుందర్ తెలుగు వాళ్లకు బాగా చేరువయ్యాడు. మళయాలంలో ఈయన నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. మూడేళ్లలోనే 60 సినిమా లకు పైగా సంగీతం అందించాడు గోపీ. ఇక ఇప్పుడు తెలుగులో ఆయన దూకుడు చూపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు ఈయనే సంగీతం అందించాడు. మొన్నొచ్చిన నిన్నుకోరికి అద్భుతమైన స్వరాలందించాడు గోపీసుందర్. ఇక ఇప్పుడు కూడా గోపీ చేతుల్లో చాలా సినిమాలే ఉన్నాయి. కరుణాకరణ్ తో సాయిధరంతేజ్ చేస్తోన్న సినిమాకు ఈయన సంగీతం అందిస్తున్నాడు.
ఇక అనిరుధ్ కూడా తెలుగులో పాగా వేస్తున్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తున్నాడు ఇండస్ట్రీకి. ఇది ఇంకా విడుదలే కాలేదు. అప్పుడే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు కూడా ఈయనే సంగీతం అందించబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో కచ్చితంగా అనిరుధ్ పేరు తెలుగులో మారుమోగిపోవడం ఖాయం. జిబ్రన్ కూడా అప్పుడప్పుడూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రన్ రాజా రన్, జిల్, బాబు బంగారం లాంటి సినిమాలతో ఓకే అనిపించాడు జిబ్రన్. పటాస్, అసుర, రాజా ది గ్రేట్ లాంటి సినిమాలతో సాయికార్తిక్.. ఇక ఫిదా సినిమాతో మాయ చేసిన శక్తికాంత్ కార్తిక్.. అర్జున్ రెడ్డితో రాధన్.. పెళ్లి చూపులుతో వివేక్ సాగర్.. ఇలా కొత్త సంగీత దర్శకులు దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ గా మారుతున్నారు.