ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి జాతకం ఎలా మారుతుందో చెప్పడం కష్టం. అదేదో సినిమాలో ఆహుతి ప్రసాద్ చెప్పినట్లు నిన్న రైట్ అనుకున్నది.. రేపు రాంగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నిన్నటి వరకు చిరంజీవి తర్వాతి సినిమా ఏంటి అంటే బోయపాటితోనే కదా అన్నారు.
కానీ సీన్ లోకి ఇప్పుడు సడన్ గా కొరటాల శివ వచ్చాడు. ఈయన ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చేసిన నాలుగు సినిమాలు కూడా బాగానే ఆడాయి. భరత్ అనే నేను కాస్త అటూ ఇటూ అయినా.. కలెక్షన్లు మాత్రం 90 కోట్లకు పైగానే వచ్చాయి. దాంతో ఇది కూడా అబౌ యావరేజ్ కిందే లెక్క. అంటే ఇప్పటి వరకు ఫ్లాప్ లేని ప్రయాణం అన్నమాట. పైగా సందేశాత్మక కథలను బాగా చెప్తాడనే పేరుంది. కమర్షియల్ హంగులు అద్ది.. మెసేజ్ లు ఇవ్వడంలో బాగా ఆరితేరిపోయాడు కొరటాల శివ.
ఈ మధ్యే ఈయన చిరంజీవిని కలిసాడు.. ఓ కథ కూడా చెప్పాడు. దానికి మెగాస్టార్ కూడా ఓకే అన్నాడు. ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు. దాంతో కొరటాల కోసం ఇప్పుడు సైరా జోరు పెంచేసాడు మెగాస్టార్. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ లోపు సైరా టాకీ పూర్తి చేయాలని సురేందర్ రెడ్డిని కోరుతున్నాడు చిరంజీవి.
అన్నీ కుదిర్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి చిరు-కొరటాల సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే కొరటాల సీన్ లోకి వస్తే మరి బోయపాటి ఏమైపోయినట్లు..? ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక బాలయ్యతో సినిమా కమిట్మెంట్ ఉంది. ఈ రెండూ పూర్తయ్యేలోపు చిరు కూడా కొరటాలతో తన సినిమా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటాడు. అప్పటి వరకు ఈ దర్శకుడికి ఎదురుచూపులు తప్పవు.