ఒక్కోసారి అంతే.. మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో మునిగిపోతుంటాం. ఇప్పుడు క్రిష్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. ఈయన కూడా ఇప్పుడు రెండు భారీ బయోపిక్స్ మధ్యలో ఇరుక్కుపోయి నలిగిపోతున్నాడు. తనకు తెలియకుండానే ఈ సమస్యలో పడిపోయాడు క్రిష్. తను కూడా ఊహించుకోలేని స్థాయిలో ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం కావడంతో అటూ ఇటూ పరుగు తీస్తున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం ఈయన కోయంబత్తూర్ లో ఉన్నాడు.
అక్కడే మణికర్ణిక కొత్త షెడ్యూల్ జరుగుతుంది. ఇక్కడ నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఆర్నెళ్ల కిందే పూర్తైంది. కానీ సినిమా అంతా చూసిన తర్వాత కంగన రనౌత్ కు కొన్ని సీక్వెన్స్ లు నచ్చలేదు. దాంతో మళ్లీ రీ షూట్ కు ఆదేశించింది. చేసేదేం లేక క్రిష్ మరోసారి మణికర్ణికపై మనసు పెడుతున్నాడు. మరోవైపు ఇక్కడ పెద్దాయన బయోపిక్ కూడా లైన్ లోనే ఉంది.
ఎన్టీఆర్ బయోపిక్ తొలి షెడ్యూల్ పూర్తి చేసి కోయంబత్తూర్ వెళ్లాడు క్రిష్.
అక్కడ పని పూర్తిచేసి మళ్లీ ఇక్కడికి రానున్నాడు. మరో ఆర్నెళ్ల పాటు ఈ షిఫ్టింగులు క్రిష్ కు తప్పేలా లేవు. ఆగస్ట్ తొలి వారంలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రం 2019 జనవరి 9న విడుదల కానుంది. మరోవైపు మణికర్ణిక జనవరి 25న విడుదల కానుంది. అంటే రెండు వారాల గ్యాప్ లో రెండు భారీ బయోపిక్ లతో రానున్నాడు ఈ దర్శకుడు. దాంతో బాంబే టూ భాగ్యనగరానికి చక్కర్లు కొడుతున్నాడు క్రిష్.
ఝాన్సీ లక్ష్మీభాయ్ బయోపిక్ అంటే క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.. మరోవైపు ఎన్టీఆర్ కూడా నేషనల్ వైడ్ పాపులర్. దాంతో ఈ రెండు బయోపిక్ లపై భారీ అంచనాలున్నాయి. దాంతో ఈ రెండు సినిమాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఈ దర్శకుడు.