ఏమో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కణం సినిమా ప్రతీసారి వాయిదా పడుతూనే ఉంది. నిజానికి గతేడాదే రావాల్సిన ఈ చిత్రం 2018 ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ అయింది. ఆ తేదీ కూడా కాకుండా ఫిబ్రవరి 23 అన్నారు. ఇప్పుడు ఈ తేదీ కూడా వెళ్లిపోయింది. ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తైపోయింది. అయినా కానీ మరో పది రోజుల పాటు సినిమాను వాయిదా వేసారు. కారణం మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు. సాయిపల్లవి ఉండటంతో కణం సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించాడు. ఈయన నటించిన ఛలో సూపర్ హిట్ కావడంతో అది కూడా కణంకు హెల్ప్ కానుంది. ఏఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించడం విశేషం. అయితే ఈ చిత్ర విడుదలకు నాగశౌర్యకు వచ్చిన విజయమే కారణం అని తెలుస్తుంది. ఛలో విజయాన్ని చూపించి కణం సినిమాను తెలుగులో ఎక్కువ రేట్ లకు అమ్మాలని చూస్తున్నారు. ఇదే సినిమా విడుదలకు అడ్డు పడుతుందని తెలుస్తుంది.
ట్రైలర్ చూస్తుంటేనే కణం సినిమా కచ్చితంగా ఏదో సంచలనం సృష్టించడం ఖాయం అనిపించింది. ఈ చిత్రంలో ఇండియాను పట్టి పీడిస్తున్న బ్రూణ హత్యలను నేపథ్యంగా తీసుకున్నాడు విజయ్. ముఖ్యంగా అబార్షన్లు చేయడం అనేది ఎంత దారుణం అనేది ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు. ఈ కాన్సెప్ట్ కూడా సంచలనాత్మకమే. ట్రైలర్ లోనే సారీ మా.. నేను చేసింది తప్పే. అలా అని ఇది వద్దమ్మా.. ప్లీజ్ అనే డైలాగ్ వింటుంటే కడుపులో ఉన్న పిండం అమ్మను వేడుకుంటున్నట్లు చూపించాడు విజయ్. సాయిపల్లవి డైలాగ్స్ ప్రేక్షకులను అలరించడం ఖాయం. ఎవరో హత్యకు గురి కావడం.. హంతకుడి కోసం పోలీసులు గాలించడం.. ఇంటిలో క్షుద్ర పూజలు చేయడం.. ఇవన్నీ కణం సినిమాపై అంచనాలు.. ఆసక్తి రెండూ పెంచేస్తున్నాయి.
కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. కణంలో సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తమిళ్లో ఇదే పాత్రను ఆర్ జే బాలాజీ నటిస్తున్నాడు. ఓ పాప చుట్టూ ఈ కథ అల్లుకున్నాడు విజయ్. వరస విజయాలతో దూసుకుపోతున్న సాయిపల్లవి కణంకు ప్రాణంగా నిలిచింది. ఈమె నటిస్తుంది కాబట్టే తెలుగులోనూ కణంపై భారీ అంచనాలున్నాయి. కచ్చితంగా ఈ చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టిస్తుందని నమ్ముతు న్నారు చిత్రయూనిట్. కానీ కావాలనే సినిమాను ఆపేస్తున్నారు. మరి ఛలో రావడమే కణంకు శాపంగా మారిందా..? ఏమో చూడాలి మార్చ్ 3న అయినా కణం వస్తుందో రాదో..?