ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతుంది.. ఇప్పటి వరకు 15 సినిమాలు పూర్తి చేసాడు.. హిట్లు కొట్టాడు.. సూపర్ హిట్లు కూడా ఇచ్చాడు. కానీ మార్కెట్ లో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాడు. ఆ హీరోనే నాగచైతన్య. వారసత్వం ఉండి.. బోలెడంత బ్యాగ్రౌండ్ ఉండి కూడా ఇప్పటికీ రేస్ లో వెనకే ఉన్నాడు ఈ హీరో.
నాని లాంటి హీరోలు కూడా నాగచైతన్యతోనే ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఇప్పుడు 40 కోట్ల రేంజ్ లో ఉంటే చైతూ మాత్రం ఇప్పటికీ 30 కోట్ల మార్క్ కూడా అందుకోలేకపోయాడు. దాంతో ఇప్పుడు తన మార్కెట్ పెంచుకోవడం కోసం ట్రై చేస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈయన కమిటైన సినిమాలు కూడా ఇలాగే ఉన్నాయి. సవ్యసాచిపై భారీ అంచనాలున్నాయి. చందూమొండేటి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం కచ్చితంగా 30 కోట్ల కలను తీరుస్తుందని నమ్ముతున్నాడు ఈ హీరో.
ఇక దాంతోపాటు మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడుపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా ఈ చిత్రం అల్లరి అల్లుడు చిత్రానికి అన్ అఫీషియల్ రీమేక్ అని తెలుస్తుంది. కథంతా దాని స్పూర్థితోనే మారుతి రాసుకున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రంతో పాటు శివనిర్వాణ సినిమా కూడా ఉంది. ఇందులో సమంతతో నటించనున్నాడు నాగచైతన్య. ఈ మూడు సినిమాలతో కచ్చితంగా తన మార్కెట్ పెరిగిపోతుందని భావిస్తున్నాడు చైతూ. మరి చూడాలిక.. అక్కినేని వారసుడి ఆశలను ఈ సినిమాలు ఎంతవరకు తీరుస్తాయో..?