మొదలైంది.. ఆ సినిమా కూడా మొదలైంది.. భార్యతో కలిసి నటించాలంటే బలమైన స్క్రిప్ట్ కావాలని అడిగిన నాగచైతన్య కోరికను మన్నించే స్క్రిప్ట్ వచ్చేసింది. నిన్నుకోరి లాంటి సెన్సిబుల్ సినిమా చేసిన శివనిర్వాన ఇప్పుడు అక్కినేని జంట కోసం అద్భుతమైన కథ వండుకుని తీసుకొచ్చాడు. చైతూ, సామ్ కలిసి నటిస్తున్నారంటే ఉండే అంచనాలు వేరుగా ఉంటాయి కాబట్టే ఇన్ని రోజులు ఎన్ని కథలు వచ్చినా వద్దన్నారు ఈ జంట. కానీ ఇప్పుడు కాదనలేని కథతో వచ్చాడు శివ.
దాంతో కాదనలేక కమిటైపోయారు ఈ జోడీ. షైన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. నాగార్జున ముఖ్యఅతిథిగా వచ్చాడు. కోనవెంకట్ మరో సారి శివనిర్వాణకు బ్యాక్ బోన్ గా ఉండబోతున్నాడు. ఈ చిత్రానికి ప్రేయసి లేదంటే శ్రీమతిల్లో ఓ టైటిల్ పరిశీలిస్తున్నాడు శివ. నిన్నుకోరి తరహాలోనే ఇది కూడా మనసుకు హత్తుకునేలా ఉంటుందని చెబుతున్నాడు ఈ దర్శకుడు. ఇందులో భార్యాభర్తలుగానే నటిస్తున్నారు ఈ జంట. పెళ్లి గొప్పతనం చెప్పేలా ఈ చిత్రం ఉండబోతుంది. ఇప్పుడు ఇల్లాలే ప్రేయసిగా మారడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి ఈ రియల్ లైఫ్ కపుల్ తో కలిసి శివనిర్వాన ఏం మాయ చేస్తాడో చూడాలిక..!