తండ్రుల ఆస్తులు తనయులకే సొంతం అవుతాయి కదా..! ఇండస్ట్రీలోనూ అంతే. తండ్రుల సినిమాలను ఇప్పుడు కొడుకులు రీమేక్ చేసుకుం టున్నారు. దానికి ఎవరి పర్మిషన్లు కూడా అవసరం లేదు. తండ్రి అనుమతి.. ఆ నిర్మాతల అనుమతి ఉంటే చాలు. గతేడాది రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నిన్నేపెళ్లాడతాను కావాల్సినంత వాడేసాడు నాగచైతన్య. ఈ చిత్రం అతడికి కావాల్సిన విజయాన్ని కూడా అందించింది.
ఇక ఇప్పుడు మారుతితో చేయబోయే శైలజారెడ్డి అల్లుడు కూడా అల్లరి అల్లుడు సినిమాకు రీమేక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ చూపులు కూడా తండ్రి సినిమాలపై పడుతున్నాయి. ఇప్పటికే తండ్రి పాటలకు చిందేసిన చరణ్.. ఇప్పుడు ఏకంగా సినిమాపై కన్నేసాడు. ప్రస్తుతం ఈయన బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది.
ఇదిలా ఉంటే చరణ్-బోయపాటి సినిమా గురించి ఓ కొత్త న్యూస్ బయటికి వచ్చింది. అదే ఈ సినిమా చిరంజీవి గ్యాంగ్ లీడర్ ను పోలి ఉంటుందని..! బోయపాటి తన స్టైల్ లో నాటి గ్యాంగ్ లీడర్ ను మార్చేస్తున్నాడని తెలుస్తుంది. దానికి రాజస్థాన్ బ్యాక్ డ్రాప్ ఇస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తు న్నాయి. ఇందులో నిజం కూడా లేకపోలేదు. బోయపాటి సినిమాలో తమిళ హీరో ప్రశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
ఇది చరణ్ కు పెద్దన్నయ్య పాత్ర. ఇక ఇప్పుడు అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర మరో అన్నయ్యగా ఎంపికయ్యాడు. ఇతడికి జోడీగా అనన్య నటిస్తుంది. గ్యాంగ్ లీడర్ లోనూ చిరంజీవికి ఇద్దరు అన్నయ్యలు ఉంటారు. ఒకటి మురళి మోహన్.. మరొకరు శరత్ కుమార్.
ఇప్పుడు బోయపాటి సినిమాలోనూ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఇక విలన్ గా అందులో రావుగోపాలరావు రప్ఫాడిస్తే.. ఇక్కడ వివేక్ ఒబేరాయ్ నటిస్తున్నాడు. ఇది లెజెండ్ లో జగపతిబాబు కారెక్టర్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు బోయపాటి శీను.
ఈ చిత్రంలో మరో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఎమోషన్. హై ఓల్టేజ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుందని చెబుతున్నాడు బోయపాటి. మరి ఇది గ్యాంగ్ లీడర్ లా ఉంటుందా.. లేదంటే అక్కడ్నుంచి స్పూర్తి పొందుతున్నాడా అనేది పక్కనబెడితే రామ్ చరణ్ కు గ్యాంగ్ లీడర్ గా చూడటం మాత్రం మెగా అభిమానులకు పండగే పండగ. ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదల కానుంది. గతంలో ఎవడు.. నాయక్ సంక్రాంతికే వచ్చాయి.