బాహుబలి తర్వాత ప్రభాస్ తెలుగు హీరో కాదు. ఇప్పుడు ఈయన ఇండియన్ హీరో. బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను చాలానే సెట్ చేసాడు ఈయన. దాంతో ఇటు తెలుగు.. అటు హిందీలో మార్కెట్ సొంతం చేసుకుని సరికొత్త సూపర్ హీరో అయ్యాడు ప్రభాస్. అందుకే సాహో సినిమాతో అది అలాగే నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆయన రేంజ్ కూడా అలా పెరిగిపోయింది మరి. అందుకే సాహోకు ఏ మాత్రం వెనకాడకుండా 200 కోట్ల బడ్జెట్ ఇచ్చారు యువీ క్రియేషన్స్. సుజీత్ చెప్పిన కథను ప్రభాస్ కూడా అదే రేంజ్ లో నమ్మాడు. దుబాయ్ లో ఈ చిత్ర షూటింగ్ కోసం మూడు నెలలుగా ట్రై చేస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పటికే మూడు సార్లు అనుమతులు నిరాకరించారు. కానీ ఇప్పుడు అది వచ్చేసింది. అందుకే దుబాయ్ కు వెళ్లిపోయారు చిత్రయూనిట్. మార్చ్ 30 న అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు కూడా.
ఎప్రిల్ నెలాఖరు వరకు కూడా అక్కడే ఉండబోతున్నారు చిత్రయూనిట్. 25 నిమిషాల భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం 40 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడు సుజీత్. స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఈ చిత్రం కోసం భారీ యాక్షన్ సీక్వెన్సులు ప్లాన్ చేస్తున్నాడు. దుబాయ్ లో బూర్జ్ ఖలీఫా దగ్గర చిత్రీకరించబోయే 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఇండియన్ సినిమాల్లోనే నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుందంటున్నాడు దర్శకుడు సుజీత్. ఇక దీనికోసం ఇప్పటికే ప్రత్యేకంగా దుబాయ్ కు కార్స్ ఇంపోర్ట్ చేయించారు.. దానికితోడు రుమేనియాలో ప్లాన్ చేసిన కార్ సీక్వెన్సులు సైతం పిచ్చెక్కించబోతున్నాయి. ఈ చిత్రం కచ్చితంగా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో బెస్ట్ యాక్షన్ మూవీగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. 2019లో ఈ చిత్రం విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.