నితిన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే కనిపిస్తుంది. ఛల్ మోహన్ రంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎప్రిల్ 4 రాత్రి నుంచే ఓవర్సీస్ ప్రీమియర్స్ పడ్డాయి. దాంతో అక్కడి నుంచి టాక్ వచ్చేసింది. ఈ చిత్రంతో లై ఇచ్చిన చేదు జ్ఞాపకాలను నితిన్ మరిచిపోతాడని తెలుస్తుంది. సినిమా పూర్తిగా ఎంటర్ టైనింగ్ గా సాగుతుందని.. సెకండాఫ్ అయితే సినిమాకు ప్రాణం అని టాక్ బయటికి వచ్చింది. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ సినిమాలో ప్రతీ సీన్ లోనూ కనిపిస్తుందని చెబుతున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రానికి కథ అందించింది గురూజీనే. కృష్ణచైతన్య దర్శకుడు. దర్శకుడు కృష్ణచైతన్యే అయినా కూడా ఈ చిత్రంపై చాలా ఫోకస్ చేసాడు త్రివిక్రమ్. కథ తనదే కావడంతో పాటు నిర్మాత కూడా కావడంతో ముందు నుంచే ఛల్ మోహన్ రంగా గురించి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాడు. కృష్ణచైతన్యకు ప్రతీ విషయంలోనూ ముందు నుంచే సూచనలు ఇస్తూ వచ్చాడు త్రివిక్రమ్. ఇప్పుడు సినిమాలో ఇది కనిపించిందని.. అజ్ఞాతవాసిలో అభిమానులకు మిస్ అయిన అన్ని అంశాలు ఇందులో కనిపించాయని.. ఛల్ మోహన్ రంగా కచ్చితంగా నితిన్ కు మాత్రమే కాదు.. త్రివిక్రమ్ కు కూడా స్ట్రెస్ బస్టర్ అని తెలుస్తుంది. కృష్ణచైతన్యతో కలిసి త్రివిక్రమ్ రాసిన కొన్ని డైలాగులు కూడా భలేగా పేలాయంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. కచ్చితంగా ఛల్ మోహన్ రంగా ఈ ఏడాదిలో మరో హిట్ అవుతుందని.. నితిన్ కెరీర్ ను మళ్లీ గాడిన పడేసే సినిమా అవుతుందని తెలుస్తుంది. మొత్తానికి ఊహించినట్లే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చేసింది. మరి చూడాలిక.. మన దగ్గర పరిస్థితి ఎలా ఉండబోతుందో..?