టెంపర్.. ఎన్టీఆర్ కెరీర్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా కూడా టెంపర్ ది మాత్రం ప్రత్యేక స్థానం. ఆ సినిమాను అలా పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టాలంతే. ఎందుకంటే ఎన్టీఆర్ లో ఎంత పెద్ద నటుడు ఉన్నాడో ప్రపంచానికి తెలియజేసిన సినిమా అది. అంతేకాదు.. ఆ సినిమాతోనే తన కెరీర్ మారిపోయిందంటాడు ఎన్టీఆర్. తన కెరీర్ కు టెంపర్ అనేది ఓ టార్చ్ లైట్ అని ఇప్పటికీ చెబుతుంటాడు జూనియర్. ఇలాంటి సినిమాను రీమేక్ చేయాలన్నా.. అందులో నటించాలన్నా ఆ హీరోకు, దర్శకుడికి చాలా దమ్ముండాలి. అవి తనకు ఉన్నాయంటున్నాడు రోహిత్ శెట్టి. ఎన్టీఆర్ పాత్రను మరిపించలేకపోయినా.. అలా ట్రై చేస్తానంటున్నాడు రణ్ వీర్ సింగ్.
టెంపర్ తర్వాతే ఎన్టీఆర్ లో మార్పు వచ్చింది. నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్.. జై లవకుశ లాంటి సినిమాలు వచ్చాయి. ఇలాంటి టెంపర్ హిందీ రీమేక్ లో రణ్ వీర్ సింగ్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సింబా అనే టైటిల్ పెట్టాడు రోహిత్ శెట్టి. ఇక్కడే చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చాడు రోహిత్ శెట్టి. తెలుగులో ఎంతో సీరియస్ గా సాగే ఈ చిత్రాన్ని హిందీలో కామెడీ చేస్తున్నాడా అనే అనుమానం రాక మానదు ఫస్ట్ లుక్ చూస్తుంటే. రోహిత్ కూడా ఈ చిత్ర థీమ్ మాత్రమే తీసుకుని.. టెంపర్ రీమేక్ ను పూర్తి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తానంటున్నాడు. అలా చేస్తే సోల్ మిస్సై.. సినిమాకు ఎక్కడ దెబ్బ పడుతుందో అని కంగారు పడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. 2018 డిసెంబర్ 28న సింబా విడుదల కానుంది. చూడాలిక.. హిందీ టెంపర్ ఎలా ఉండబోతుందో..?