బాలీవుడ్ లో హీరోలెంత మంది ఉన్నా సల్మాన్ ఖాన్ కు ఉన్న ఇమేజ్ వేరు. ఈ పేరు వింటే బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. అమీర్, షారుక్ ఎంత పెద్ద తోపు హీరోలైనా కావచ్చు. కానీ ఇండియాలో మాత్రం కండలవీరుడిని కొట్టే హీరోనే లేదు. ముఖ్యంగా మాస్ లో ఈ హీరో ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. వసూళ్లు లేక చాలాచోట్ల మూత పడిన సింగిల్ స్క్రీన్స్ ను వాంటెడ్ తో రీ ఓపెన్ అయ్యేలా చేసిన ఘనత సల్మాన్ దే. ఈ హీరో సినిమా విడుదలయ్యేదే ఆలస్యం తొలిరోజు తొలి షో చూడాలనుకునే అభిమానులు కోట్లల్లో ఉంటారు. సాక్షాత్తు దుబాయ్ షేకులు సైతం సల్మాన్ అంటే పడి చచ్చిపోతారు. బాలీవుడ్ లో వరసగా 11 సార్లు 100 కోట్ల సినిమాలు ఇచ్చిన రికార్డ్ సల్మాన్ సొంతం.
ఈ రికార్డ్ అందుకున్న ఏకైక హీరోగా చరిత్రలో నిలిచిపోయాడు. సల్మాన్ గత చిత్రం ట్యూబ్ లైట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు టైగర్ జిందా హైతో వచ్చాడు సల్మాన్. ఈ చిత్రం రెండు రోజుల్లోనే 70 కోట్లు వసూలు చేసింది ఇండియాలో. మూడో రోజే 100 కోట్ల క్లబ్ లో చేరిపోవడం ఖాయమైపోయింది. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ, బి, సి సెంటర్లు అని తేడా లేకుండా అన్ని చోట్లా ఇరగదీస్తోంది. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన సుల్తాన్ కూడా దుమ్ము దులిపేసింది. దబంగ్ నుంచి మొదలుకొని రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, దబంగ్ 2, జైహో, కిక్, భజరంగీ భాయీజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, సుల్తాన్, ట్యూబ్ లైట్.. వరసగా 100 కోట్ల క్లబ్ లో చేరాయి. తాజాగా 12వ సారి 100 కోట్లు కొల్లగొట్టాడు సల్మాన్. బాలీవుడ్ లో అత్యధిక బిలియన్ సినిమాలున్న హీరో కూడా సల్మానే. సుల్తాన్ జోరు చూస్తుంటే తొలి ఐదు రోజుల్లోనే 150 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది.