రెండేళ్ల గ్యాప్ తీసుకుని వచ్చినా కూడా రాజా ది గ్రేట్ తో మంచి ఓపెనింగ్స్ సాధించాడు రవితేజ. ఆ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా ప్రేక్షకులు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు టచ్ చేసి చూడు విషయంలో ఆ పప్పులు ఉడకలేదు. ఈ సారి డిజాస్టర్ ఇచ్చారు ప్రేక్షకులు. ఈ చిత్రం దారుణమైన ఫలితం దిశగా అడుగేస్తుంది. వక్కంతం వంశీ కథ కానీ.. రవితేజ నటన గానీ.. రాశీఖన్నా, సీరత్ కపూర్ అందాలు కానీ టచ్ చేసి చూడును కాపాడలేకపోతున్నాయి. తొలి మూడు రోజుల్లో మరీ దారుణమైన వసూళ్లు సాధించింది ఈ చిత్రం. రవితేజ రీసెంట్ సినిమాల్లోనే అత్యంత దారుణంగా కేవలం 6 కోట్లతోనే సరిపెట్టుకుంది టచ్ చేసి చూడు. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్లు వసూలు చేసింది. రవితేజ ఇమేజ్ కి ఇది చాలా తక్కువ వసూళ్లు. ఇలాంటి పాత చింతకాయ్ పచ్చడి కథలు గతంలో ఎన్నో చేసాడని చెబుతున్నారు అభిమానులు. ఆయన నుంచి ఊహించే సినిమా మాత్రం ఇది కాదంటున్నారు వాళ్లు. కొత్త దర్శకుడు విక్రమ్ సిరి దీన్ని తెరకెక్కించాడు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు.. వక్కంతం వంశీ ఇచ్చిన పాత కథనే ఆయన కాస్త మెరుగులు దిద్దాడు. విడుదల తర్వాత రవితేజ కథల ఎంపికపైనే ఇప్పుడు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. రాజా ది గ్రేట్ తో కాస్త పర్లేదు అనిపించిన రవితేజ.. ఇప్పుడు మరోసారి రేస్ లో వెనక బడిపోయాడు. నాని లాంటి కుర్రాళ్లను తట్టుకోవాలంటే ఈయన వరస సినిమాలు చేయడం మాత్రమే కాదు.. విజయాలు కూడా అందుకోవాలి. అలా చేయకపోతే మరో రెండేళ్లలో మాస్ రాజా పూర్తిగా గాడితప్పడం ఖాయం.