పొలిటికల్ అంటేనే ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది ప్రేక్షకుల్లో. ఇక అదే నేపథ్యంలో సినిమా అంటే ఉండే రేంజ్ వేరు. కానీ తెలుగులో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. వచ్చినా అందులో ఇంకా తక్కువగా విజయం సాధించాయి. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ మన హీరోల దృష్టి మొత్తం రాజకీయాల వైపు వెళ్లిపోయింది. ఉన్నట్లుండి ఇప్పుడు అంతా పొలిటికల్ రూట్ లోనే వెళ్తున్నారు. గతేడాది నేనేరాజు నేనేమంత్రితో రాజకీయాలను బాగా హీట్ ఎక్కించాడు రానా. ఇప్పుడు మహేశ్ కూడా భరత్ అనే నేనులో ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. ఇది పూర్తిగా పొలిటికల్ కోణంలో తెరకెక్కుతోన్న సినిమా. కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఎప్రిల్ 20న విడుదల కానుంది. మహేశ్ కు ఇదే తొలి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా. దూకుడులో కాసేపు డూప్లికేట్ ఎమ్మెల్యేగా నటించాడు.
ఇక కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నాడు. అదే ఎమ్మెల్యే. మంచి లక్షణాలున్న అబ్బాయి అని అర్థం. అయితే టైటిల్ లో ఉన్న ఎమ్మెల్యేనే సినిమాలో కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ రాజకీయ నాయకుడితో గొడవపడి.. ఓ కుర్రాడు ఎమ్మెల్యే ఎలా అయ్యాడు అనేది కాన్సెప్ట్. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాజల్ హీరోయిన్. మార్చ్ 23న ఈ సినిమా విడుదల కానుంది. ఇక మంచు విష్ణు కూడా పూర్తిస్థాయి పొలిటికల్ మూవీ చేస్తున్నాడు. అదే ఓటర్. ఈ చిత్రంపై కూడా ఆసక్తి బాగానే ఉంది. వీళ్ళంతా ఉండగానే ఇప్పుడు నోటా అంటూ విజయ్ దేవరకొండ వచ్చాడు. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్ అని అర్థం. అంటే ఎవరూ వద్దు.. మాకు మేమే అని ప్రజలు తీసుకునే నిర్ణయం. ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం బై లింగువల్ గా వస్తుంది. ఈ చిత్రంతోనే తమిళ ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాడు ఈ హీరో. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో మన హీరోలంతా ఇప్పుడు రాజకీయ రంగుల్లో తేలిపోతున్నారు.