2017 తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చింది. ఏడాది మొదట్నుంచీ దాదాపు వచ్చిన పెద్ద సినిమాలన్నీ మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. చిన్నోళ్లు కూడా బాగానే తీసుకొచ్చారు. కానీ కొన్ని రోజులుగా ఇండస్ట్రీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. కావాల్సినన్ని సినిమాలు వస్తున్నాయి కానీ వాటిని చూడ్డానికి ప్రేక్షకులు మాత్రం థియేటర్స్ కు రావడం లేదు. గడిచిన ఒక్క నెలలోనే దాదాపు 30 సినిమాలు విడుదలయ్యాయంటే నమ్మడం కష్టమే. కానీ అందులో ఏది విజయం సాధించిందంటే చెప్పడం కూడా అసాధ్యం. ఎందుకంటే ఒక్కటి కూడా ఆడలేదు. జవాన్ లాంటి భారీ చిత్రాలు కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. మళ్లీరావా, మెంటల్ మదిలో లాంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా నిలబడలేదు.
సినిమా బాగుందనే టాక్ వచ్చినా.. థియేటర్స్ ఖాళీ అయిపోవడానికి కారణం మాత్రం ఒక్కటే.. అన్ సీజన్. సాధారణంగా నవంబర్, డిసెంబర్లలో సినిమాలు విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఇష్టపడరు. పైగా స్టార్ హీరోలెవరూ ఈ సీజన్ పై ఆసక్తి చూపించలేదు. దాంతో డిటెక్టివ్, ఖాకీ, గృహం, అదిరింది లాంటి డబ్బింగ్ సినిమాలే ఈ సీజన్ లో కాసులు రాల్చుకున్నాయి కానీ మన హీరోలెవరూ విజయం సాధించలేదు. గతవారం కూడా అరడజన్ సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఏదీ ఆడట్లేదు.. థియేటర్స్ అన్నీ ఇప్పుడు ఖాళీగా మారిపోయాయి. డిసెంబర్ చివర్లో నాని నటించిన ఎంసిఏ.. అఖిల్ హలో వచ్చేంత వరకు థియేటర్స్ ఇలా ఖాళీగా ఉండిపోవాల్సిందే.. మరో ఆప్షన్ కూడా లేదు. వాళ్లొస్తే మళ్లీ థియేటర్స్ కళకళలాడిపోతాయి. అప్పటి వరకు ఈగలు తోలుకోవాల్సిందే..!