రోజురోజుకీ మనం ముందుకెళ్తున్నాం.. విజన్ 2020 అంటూ ఏడాదికేడాది కొత్త కొత్త టెక్నికల్ హంగులతో ప్రపంచం ముందుకెళ్తుంది. కానీ మన దర్శకులు మాత్రం ఇప్పుడు మనల్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. అది కూడా 80ల్లోకే వెళ్తున్నారు. ఇప్పటికే రంగస్థలం సినిమా సృష్టిస్తోన్న సంచలనాలు చూస్తుంటే 80ల్లో బ్యాక్ డ్రాప్ ఎంతగా అచ్చొచ్చిందో అర్థమైపోతుంది. ఆ సినిమా అంతా అక్కడే జరుగుతుంది. దానికోసం సుకుమార్ చాలా జాగ్రత్తలే తీసుకున్నాడు. ఇక ఇప్పుడు సుధీర్ వర్మ-శర్వానంద్ కూడా 80ల్లో బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వైజాగ్ లో మొదలైంది. ముందు ఈ చిత్రం ఏదో అనుకున్నాం కానీ ఇది కూడా పీరియాడికల్ మూవీ అని ఇప్పుడే అర్థమైంది. తొలిరోజు షూటింగ్ లో 80ల్లో సెట్ దర్శనం ఇచ్చింది.
మగధీర.. మర్యాదరామన్న.. భాగమతి లాంటి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రవీందర్ రెడ్డి. సుధీర్ వర్మ సినిమా కోసం 80ల నాటి వైజాగ్ పరిసరాలను సిద్ధం చేశారు. ఓ టీ కొట్టు.. పాడుబడ్డ బంగాళాలు.. 1982 అని నెంబర్ కనిపించేలా వైజాగ్ బస్టాండ్.. పాత సందులు.. ఆనాటి దృశ్యాలను ప్రతిబింబించేలా వేసిన ఈ సెట్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ మొత్తం జరగనుంది. నిజానికి ఈ సినిమాకు ముహూర్తం పెట్టి కూడా చాలా కాలమైంది. అయితే దీనికంటే ముందు హను రాఘవపూడి పడిపడి లేచే మనసు పూర్తిచేసాడు శర్వానంద్. దానికి కారణం సాయిపల్లవి డేట్స్ తో వచ్చే సమస్యే. ఆమె డేట్స్ మళ్లీ దొరకవేమో అని ముందుగానే ఈ చిత్రం పూర్తి చేసారు. ఇప్పుడు సుధీర్ వర్మ సినిమాతో బిజీ అయ్యాడు శర్వానంద్. రెండో షెడ్యూల్ కాకినాడ పోర్టులో జరగనుంది. ఇక మూడో షెడ్యూల్ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కోటి రూపాయలతో సెట్ వేయనున్నారు. మొత్తానికి మరో సినిమా కూడా 80ల్లోకి వెళ్లిపోయిందన్నమాట.