ఈ మాట మరెవరితోనైనా అంటే కచ్చితంగా పిచ్చోడు అంటారు. కానీ వర్మకు మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే ఆయన దేవున్ని కూడా నిలదీస్తాడు కదా..! నన్నుంచి శ్రీదేవిని ఎందుకు తీసుకెళ్లావ్ అని దేవున్ని అడిగే దమ్మున్న దర్శకుడు వర్మ. ఆమె చనిపోయిందంటూ జీవితంలో ఆమెతో మాట్లాడను అని అలిగిన సెటైరికల్ కింగ్ వర్మ. శ్రీదేవి మరణంతో బోనీకపూర్ కంటే ఎక్కువగా వర్మే బాధ పడిపోతున్నాడు. అసలు అంతా వెళ్లి బోనీ అండ్ ఫ్యామిలీని ఓదారుస్తున్నారు కానీ.. ముంబైలోని కొందరు వచ్చి కాస్త వర్మను కూడా ఓదార్చి వెళ్తే బాగుంటుందేమో..? ఎందుకంటే ఆయన పాపం రెండు మూడు రోజులుగా ఇంట్లోంచి బయటికి కూడా రావట్లేదు.
పెగ్గు పెగ్గుకో ట్వీట్ పెడుతూ అభిమానం హద్దుల్లేకుండా పొంగిస్తున్నాడు. ఒక్కోసారి దేవున్నే తిడతాడు.. మరోసారి శ్రీదేవిని తిడతాడు.. ఇంకోసారి బోనీకపూర్ ను తిడతాడు.. కానీ తిట్టడం మాత్రం ఖాయం. శ్రీదేవిది మిస్టరీ డెత్ అని అని తేలగానే బోనీకపూర్ నే చంపేస్తానంటూ బయల్దేరాడు వర్మ. ఇక ఇప్పుడు అన్నీ అయిపోయాయి.. శ్రీదేవిని కామన్ డెత్ అని తేలిపోయింది. దాంతో దేవుడితో కాంప్రమైజ్ అయిపోయాడు ఈ దర్శకుడు. ఇంతకు ముందు ఆమె చనిపోయిందని తన సినిమా షూటింగ్ ను కూడా ఆపేసి ఇంట్లోనే ఉన్న వర్మ.. ఇప్పుడు శ్రీదేవిని ఎవరూ చంపలేదు.. ఆమె చచ్చిపోయింది అని తెలిసిన తర్వాత.. తెలుసుకున్న తర్వాత నాగార్జున సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు.
అతడితో ఆయన చేస్తోన్న సినిమా ఆఫీసర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసాడు. మే 25న ఈ సినిమా విడుదల కానుంది. అసలు శ్రీదేవి బాడీ ఇండియాకు వచ్చి.. ఇంటికి వచ్చి.. ఆమె అంత్య క్రియలు అయ్యేవరకు కూడా వర్మ మామూలు మనిషి కాలేడేమో అనుకుంటే.. ఇప్పుడు సడన్ గా ఫస్ట్ లుక్ విడుదల చేసి షాక్ ఇచ్చాడు వర్మ. తన ఊహలు ఎవరికీ అర్థం కావంటూ మరోసారి ట్విస్ట్ ఇచ్చాడు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. జీవితాంతం శ్రీదేవికి భక్తుడిగానే ఉన్నాడు వర్మ. ఆమె బతికున్నపుడు ఆరాధించాడు. కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత తిడుతున్నాడు. ఎందుకంటే తనకు చెప్పకుండా వెళ్లిపోయిందని బాధ అంటున్నాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. శ్రీదేవిని కడసారి చూడ్డానికి కూడా తాను రానంటున్నాడు వర్మ. అచేతనంగా ఉన్న శ్రీదేవిని చూడ్డానికి తన మనసు సహకరించదంటున్నాడు ఈ దర్శకుడు. మొత్తానికి ఇప్పుడు శ్రీదేవి మరణం బోనీ కంటే ఎక్కువ వర్మనే ఎక్కువగా కుంగదీస్తుందన్నమాట.