రోజురోజుకీ ధడక్ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఝాన్వీకపూర్ తొలి సినిమాగా ముందు దీనికి క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు ఒక్కో పాట విడుదల అవుతుంటే సినిమాను ఎంత కలర్ ఫుల్ గా తీసారో అర్థమైపోతుంది. సైరాత్ లో బడ్జెట్ లో పూర్తి చేస్తే.. ధడక్ ను కావాల్సినంత బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ లో తెరకెక్కించాడు దర్శకుడు శశాంత్ కైతాన్. అతిలోకసుందరి నట వారసురాలిగా తన తొలి సినిమాలో బానే స్క్రీన్ ప్రజెన్స్ ఇచ్చింది ఝాన్వీ.
అందంతో పాటు అభినయం చూపించింది. ట్రైలర్ నిండా ఝాన్వీనే బాగా హైలైట్ చేసారు. ఇప్పుడు పాటల్లో కూడా ఈ ముద్దుగుమ్మను చూపిస్తున్నారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఝాన్వీ కూడా మాయ చేస్తుంది. తాజాగా విడుదలైన పెహ్లీ బార్ పాట కూడా అదిరిపోయింది. ఈ సినిమాతో ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సైరాత్ చూసిన వాళ్లకు కూడా ఈ చిత్రం కొత్తగా అనిపిస్తుంది.
శ్రీదేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తన కూతుర్ని కరణ్ జోహార్ చేతుల్లో పెట్టింది. పాపం ఆ సినిమా చూడకుండానే ఆమె పైకి వెళ్లిపోయింది. అయితే జాన్వి పరిచయానికి సైరాత్ సరైన సినిమా కాదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు సైరాత్ లో అంతగా చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదని.. ఆ టైమ్ లో మరాఠీయులకు ఆ సినిమా ఎందుకో కనెక్ట్ అయిపోయిందంతే.. హిందీలో సైరాత్ క్లిక్ అవ్వడం కష్టమే అంటున్నారు. కానీ ఇప్పుడు దర్శకుడు తెరకెక్కించిన విధానం చూస్తుంటే సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు ఎక్కేలా కనిపిస్తుంది. జులై 20న విడుదల కానుంది ఈ చిత్రం.