శ్రీదేవి కూతురు తొలి సినిమా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండదా..? పైగా అదేం మామూలు సినిమా కాదు.. ఓ భాషలో చరిత్ర తిరగరాసిన సినిమా.. దాంతో అలాంటి సినిమా రీమేక్ అనేసరికి ధడక్ పై ఎక్కడలేని అంచనాలు ఇప్పుడు మొదలయ్యాయి ప్రేక్షకుల్లో.
అసలు సైరాత్ లో అంతగా ఏముంది అని ఇప్పుడు ఆ సినిమాను చూస్తున్న వాళ్లు కూడా లేకపోలేరు. బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేస్తున్నపుడు కచ్చితంగా పోలికలు తప్పవు. ఒరిజినల్ కంటే బాగుందా లేదా అనే వాదన కచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ధడక్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇన్ని రోజులు ట్రైలర్.. పాటలు అన్నీ సైరాత్ కంటే హిందీలో బెస్ట్ అనిపించాడు దర్శకుడు శశాంక్ కైతాన్. కానీ మొన్న జింగాత్ అంటూ సాగే పార్టీ సాంగ్ విడుదలైనప్పుడు మాత్రం ఒరిజినల్ లోనే బాగుందనే కమెంట్స్ వినిపించాయి.
దానికి ధడక్ చిత్రయూనిట్ కూడా పాజిటివ్ గానే స్పందించింది. ఈ సినిమాతో ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సైరాత్ చూసిన వాళ్లకు కూడా ఈ చిత్రం కొత్తగా అనిపిస్తుంది. శ్రీదేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తన కూతుర్ని కరణ్ జోహార్ చేతుల్లో పెట్టింది. పాపం ఆ సినిమా చూడకుండానే ఆమె పైకి వెళ్లిపోయింది. అయితే జాన్వి పరిచయానికి సైరాత్ సరైన సినిమా కాదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అసలు సైరాత్ లో అంతగా చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదని.. ఆ టైమ్ లో మరాఠీయులకు ఆ సినిమా ఎందుకో కనెక్ట్ అయిపోయిందంతే.. హిందీలో సైరాత్ క్లిక్ అవ్వడం కష్టమే అంటున్నారు. కానీ ఇప్పుడు దర్శకుడు తెరకెక్కించిన విధానం చూస్తుంటే సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు ఎక్కేలా కనిపిస్తుంది. జులై 20న విడుదల కానుంది ఈ చిత్రం.