ఈ కుర్రాడి పేరు గుర్తు పెట్టుకోండి.. కచ్చితంగా పది రోజుల తర్వాత అంతా ఇతడి గురించే మాట్లాడుకుంటారు అంటూ మన తెలుగోడు.కామ్ లోనే ఓ న్యూస్ వేసాం గుర్తుందా..? ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. మహానటి విడుదలైన తర్వాత అంతా కీర్తిసురేష్ పర్మార్ఫెన్స్ తో పాటు మరొకరి కష్టం గురించి మాట్లాడుకుంటున్నారు.
అతడే నాగ్ అశ్విన్. మూడు పదుల వయసులోనే ఈయన మహానటిని అర్థం చేసుకున్న తీరు ఇప్పుడు అందర్నీ అబ్బురపరుస్తుంది. అసలు అప్పట్లో ఈయన నిజంగానే సావిత్రిని చూసాడా.. ఆమె జీవితాన్ని దగ్గరుండి చదివాడా అనేంతగా వెండితెరపై మాయ చేసాడు ఈ కుర్ర దర్శకుడు. మరీ ముఖ్యంగా జెమినీ గణేషన్ ను సావిత్రి పెళ్లి చేసుకోవాల్సిన సందర్భాన్ని ఆయన సృష్టించిన తీరు చూస్తే అతడిలోని దర్శకుడికి సలాం చేయాల్సిందే..!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు గ్రేట్ విజనరీ ఉన్న దర్శకుడు అని ఈ తరంలో ఒక్క రాజమౌళిని మాత్రమే అంటున్నారు. ఆయన కాకుండా మరే దర్శకున్ని కూడా అంత పెద్ద మాట అనలేదు.. అనలేరు కూడా. కానీ ఇప్పుడు ఒకేఒక్క సినిమా అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ కూడా ఇదే బిరుదు వచ్చేలా ఉంది. గొప్ప దర్శకులు సైతం భయపడే సబ్జెక్ట్ ను రెండో సినిమాతోనే తీసుకున్నాడు నాగ్ అశ్విన్.
మహానటిలో ఈయన ఒక్కరో ఇద్దరో కాదు.. ఎంతోమంది లెజెండ్స్ ను చూపించాడు. ఆ పాత్రల కోసం మళ్లీ ఇక్కడ లెజెండ్స్ నే తీసుకున్నాడు. వాళ్ళందర్నీ తన కథతో మెప్పించి.. తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. ఇదంతా చూస్తుంటే నాగ్ అశ్విన్ ను నిజంగానే గ్రేట్ విజనరీ అనడంలో తప్పు లేదనిపిస్తుంది. దీన్ని ఓ అద్భుతంగా.. మహాకావ్యంలా నాగ్ తెరకెక్కించాడు. ఇప్పుడు మహానటి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాగా మారింది. ఆ క్రెడిట్ అంతా మహానటి టీం అందరికి ఎంత వెళ్తుందో.. ఒక్క నాగ్ అశ్విన్ కు కూడా అంతే వెళ్తుంది.