నాని ఖాతాలో మరో రికార్డు వచ్చి పడింది. ఈ తరం కుర్ర హీరోల్లో ఎవరికీ లేని విధంగా ఆరు సార్లు 20 కోట్ల మార్క్ అందుకున్నాడు నాని. నాగచైతన్య, సాయిధరంతేజ్.. ఇలా తోటి హీరోలతో పోలిస్తే నాని రేంజ్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. మనోడి సినిమా అంటే కనీసం 20 కోట్లు కంపల్సరీ. ఏడాది కింది వరకు 20 కోట్ల మార్క్ అంటే నానికి పెద్ద విషయమే. అప్పటికి రాజమౌళి పుణ్యమా అంటూ ఈగ.. మారుతి మాయతో భలేభలే మగాడివోయ్ మాత్రమే 20 కోట్ల మార్క్ అందుకున్నాయి. కానీ ఏడాది కాలంలోనే జెంటిల్ మన్.. నేనులోకల్.. నిన్నుకోరి సినిమాలతో కూడా 20 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు నాలుగు రోజుల్లోనే ఎంసిఏ కూడా 22 కోట్ల మార్క్ అందుకుంది. ఐదు రోజులు ముగిసేసరికి 25 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇది నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్. హలో వచ్చినా.. ఎంసిఏ టాక్ బ్యాడ్ గా ఉన్నా ఐదు రోజుల తర్వాత కూడా ఈ చిత్ర కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. రోజుకి కనీసం 3.5 కోట్లకు పైగానే షేర్ సాధించింది. ఈ లెక్కన సినిమాకు మాస్ ప్రేక్షకుల ఓట్లు బాగానే పడుతున్నాయన్నమాట. ఇప్పటికే ఓవర్సీస్ లో 7 లక్షల డాలర్ల వైపు పరుగులు తీస్తుంది ఎంసిఏ. మొత్తానికి ఎంసిఏతో మరో హిట్ కొట్టేసాడు న్యాచురల్ స్టార్. కానీ రొటీన్ కథలు చేస్తూ పోతే.. ఏదో ఓ రోజు కచ్చితంగా నాని ఇబ్బంది పడటం ఖాయమంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు.