కలలు అందరూ కంటారు. కానీ దాన్ని నిజం మాత్రం కొందరే చేసుకుంటారు. నిద్ర పోతున్నపుడు కల దానంతటే అదే వస్తుంది. కానీ అది నిజం కావాలంటే నిద్రలోంచి లేచి బయటికి వచ్చి కష్టపడాలి. అది చాలా తక్కువ మంది చేస్తారు. అందులో నాని కూడా ఒకరు. ఈయన ఎక్కడి నుంచి మొదలై.. ఇప్పుడు ఎక్కడి వరకు ఎదిగాడో.. ఆయన జర్నీ తలుచుకుంటుంటేనే చాలా ఇన్స్ స్పైరింగ్ గా ఉంటుంది. మూడేళ్ల కింది వరకు నాని ఒక్కో సినిమాకు కోటి కూడా తీసుకునేవాడో కాదో మరి.. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ చూసి స్టార్ హీరోలు కూడా కుళ్లుకోవాల్సిన పరిస్థితి. నాని అంటే ఇప్పుడు హీరో కాదు.. హిట్ మిషన్ అంటున్నారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది వరస విజయాలు ఇచ్చాడు నాని. ఇది కలలో కూడా ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్. కానీ ఇది నాని చేసాడు.. చేసి చూపించాడు. మూడేళ్ల కింది వరకు నాని సినిమా బడ్జెట్ అంటే 10 కోట్ల లోపే. కానీ ఇప్పుడు 20 కోట్లకు పైగానే వెళ్లింది. బిజినెస్ కూడా 40 కోట్ల వరకు జరుగుతుంది.
రెండేళ్ల కింది వరకు నాని రెమ్యునరేషన్ గురించి ఎక్కడా మాటలు వినిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. నేను లోకల్ ముందు వరకు కూడా 3 కోట్ల లోపు ఉన్న నాని రెమ్యునరేషన్ ఇప్పుడు డబుల్ అయింది. నేనులోకల్ తర్వాత నిన్నుకోరి కోసం 4 కోట్లపైనే తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఎంసిఏ దిల్ రాజు కాబట్టి ఎంత తీసుకున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు చేస్తోన్న కృష్ణార్జున యుద్ధంకు మాత్రం రైట్స్ తో పాటు లెక్క 8 కోట్లకు చేరిందని తెలుస్తుంది. దాంతోపాటు అశ్వినీదత్ నిర్మాణంలో నాగార్జునతో కలిసి చేయబోయే మల్టీస్టారర్ కు కూడా 8 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలొస్తున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ తో కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేయడానికి ఏకంగా 9 కోట్లు అడిగాడని.. నాని సక్సెస్ స్ట్రీక్ చూసి అడిగినంతా ఇవ్వడానికి రెడీ అయ్యారని వార్తలొచ్చాయి. అయితే కథలో మార్పులు చేయమనడంతో నాని చేతుల్లోంచి సినిమా జారిపోయింది. కానీ అదే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు నానితో మరో సినిమా చేయబోతున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కోసం సిద్ధం చేయించిన కథలో నానిని తీసు కుంటున్నారు. ఈ సినిమా కోసం 9 కోట్లు తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఏ సపోర్ట్ లేకుండా వచ్చి.. ఇండస్ట్రీలో నిలబడటమే గగనం అనుకుంటుంటే.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలకే పోటీగా ఎదిగాడు నాని. మరో రెండు హిట్లు పడితే నాని రేంజ్ ఊహించుకోవడం కూడా కష్టమే. అంతేలెండి.. ఇండస్ట్రీలో టైమ్ నడిచినపుడే నడిపించుకోవాలి. ఇప్పుడు నాని ఇదే చేస్తున్నాడు.