అదేంటి.. మాస్ మహారాజ్ అంటే రవితేజ కదా..! అది ఆయనకు తప్ప మరే హీరోకు సరిపోదు కదా అనుకుంటున్నారా..? ఇప్పుడు నాని మారిపోయిన తీరు చూస్తుంటే కచ్చితంగా ఈయనకు మరో మాట మాట్లాడకుండా మాస్ మహారాజ్ అనే బిరుదు ఇచ్చేస్తారు. మొన్న ఎంసిఏలోనే మాస్ హీరోగా మారిపోయిన నాని.. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం కోసం పూర్తిగా మారిపోయాడు. అసలు ఈ చిత్రంలో ఈయన మేకోవర్ చూసి అంతా షాకైపోతున్నారు. కృష్ణ పాత్ర ఇందులో తిరుపతిలో ఉండే గల్లీ కుర్రాడి పాత్ర. అర్జున్ పారిస్ లో ఉంటాడు. అయితే ప్రస్తుతం కృష్ణ పాత్రకు సంబంధించిన పాట విడుదలైంది. ఇందులో నాని చిందులు చూసి అబ్బో అనుకోకుండా ఉండలేరు. ఈ పాట చూసిన తర్వాత ఏంటి నాని ఇంత మాసా అంటూ ఆశ్చర్యపోతున్నారంతా. తిరుపతి బేస్ కుర్రాడు కావడంతో ఆ స్టైల్లోనే లుంగీ కట్టుకుని గంతేస్తున్నాడు. హిప్ హాప్ తమిళన్ సంగీతం అందించిన ఈ పాట కచ్చితంగా సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. గరగాట కారన్ అనే డాన్స్ మూవ్స్ తో ఈ పాట సాగుతుంది. తమిళనాట ఫేమస్ డాన్స్ ఇది. దాన్ని ఈ సినిమా కోసం వాడుకుంటున్నాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. చిత్తూరు జిల్లా కావడం.. అక్కడికి తమిళనాడు దగ్గరగా ఉండటంతో అక్కడి నృత్యాన్ని కూడా తన సినిమాలో చూపించాడు దర్శకుడు. దానికి నాని కూడా పూర్తి సహకారం అందించాడు. ఈ పాట చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోవడం ఖాయం. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఎప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం విడుదల కానుంది. చూడాలిక.. ఈ సినిమాతో నాని ట్రిపుల్ హ్యాట్రిక్ పూర్తి చేస్తాడో లేదో..?