నాన్న..
మన జీవితంలో మరిచిపోలేని బాధ్యత.. మన బరువును తన భుజాలపై మోసే వాడు నాన్న. ఈ పదానికి ఎన్ని అర్థాలు వెతికినా.. ఇంకేదో దొరుకుతూనే ఉంటుంది. ఎందుకంటే తీరిపోని రుణం.. వీడిపోని బంధం.. చెప్పలేని కావ్యం నాన్న. సినిమాల్లో కూడా నాన్నంటే చాలా గౌరవం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో అయితే నాన్నే హీరోగా చాలా సినిమాలు వచ్చాయి.
ఆ మధ్య ఎన్టీఆర్ అయితే ఏకంగా నాన్నకు ప్రేమతో అంటూ సుకుమార్ తో ఓ సినిమా చేసాడు. అది నాన్నలందరికీ అంకితం ఇచ్చిన సినిమా. ఇక సన్నాఫ్ సత్యమూర్తిలో బన్నీ కూడా అంతే. తండ్రి కోసం పాటుపడే కొడుకుగా నటించాడు. ఆ సినిమాకు హీరో తండ్రే. శ్రీమంతుడులో మహేశ్-జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయి. రామ్ నటించిన హైపర్ అయితే పూర్తిగా తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధమే కథ. అంతెందుకు గత ఏడాది సంచలన విజయం సాధించిన ఫిదాలో తండ్రీ కూతుళ్ల ప్రేమను..
వాళ్ల మధ్య బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు శేఖర్ కమ్ముల. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న విజేత సైతం తండ్రీ కొడుకుల బంధంతోనే వస్తుంది. ఇలా ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో తీసుకున్నా తండ్రి పాత్ర ప్రాణంగా మారుతుంది. ఒకప్పుడు తండ్రి పాత్రల్ని కాస్త కామెడీగా చూపించినా కూడా ఇప్పుడు మాత్రం ఆ తండ్రి విలువను చాటిచెప్పేలా పాత్రలు రాసుకుంటున్నారు దర్శకులు. ఇలాంటి సినిమా తండ్రులకే కాకుండా మన జీవితంలో మనకు మార్గం చూపించిన నాన్నలు అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.