అవును.. నితిన్ పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఊహించనంత వేగంగా తన పెళ్లి పనులు పూర్తి చేసుకుంటున్నాడు నితిన్. మరో విషయం పట్టించుకోకుండా కేవలం కళ్యాణంపైనే ఫోకస్ చేసాడు. మార్చ్ లోనే పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. అయితే ఇదంతా నిజం పెళ్లి కోసం కాదు లెండీ..! రీల్ లైఫ్ పెళ్లి కోసమే. ఈయన నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ చిత్ర చివరి షెడ్యూల్ కు వచ్చేసింది. నమ్మడానికి ఇది కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. మొన్నటి వరకు ఒకటి రెండు షెడ్యూల్స్ అనుకున్న వాళ్లకు ఇప్పుడు చివరి షెడ్యూల్ అంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ ఈ చిత్ర షూటింగ్ ను అంత వేగంగా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. గోదారి జిల్లాల్లో తొలి షెడ్యూల్.. చండీఘర్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేసాడు దర్శకుడు. ఇక ఇప్పుడు చివరి షెడ్యూల్ మొదలైంది. జూన్ లోనే షూటింగ్ అంతా పూర్తి కానుంది. ఆగస్ట్ 9న విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో శ్రీగా రాశీ..
నివాస్ గా నితిన్ నటిస్తున్నారు. ఈ శ్రీనివాస్ ల కళ్యాణమే సినిమా టైటిల్. శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సతీష్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శతమానం భవతిని 47 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్తించిన సతీష్ వేగేశ్న.. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణంను కూడా ఇదే చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. దీనికి తగ్గట్లే అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు. గతేడాది వచ్చిన లైతో పాటు మొన్న వచ్చిన ఛల్ మోహన్ రంగా కూడా డిజాస్టరే. మరి ఇప్పుడు ఈ పెళ్లితోనైనా నితిన్ కెరీర్ గాడిన పడుతుందో లేదో చూడాలిక..!